కారు దహనం చేసిన దుండగులు
గిద్దలూరు రూరల్: కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కారును దహనం చేసిన సంఘటన గిద్దలూరు పట్టణంలోని విశ్వభారతి స్కూల్ వద్ద ఆదివారం జరిగింది. పట్టణానికి చెందిన సచివాలయం ఉద్యోగి సయ్యద్ సైఫుల్లా తన కారుకు మరమ్మతుల కారణంగా కొన్ని నెలల నుంచి విశ్వభారతి స్కూల్ సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఉంచారు. ఈ నేపథ్యంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
కురిచేడు: పంట పొలంలో కంది కోయడానికి వెళ్లిన వ్యక్తిపై అడవి పంది దాడిచేయడంతో మృతిచెందిన సంఘటన కురిచేడు మండలంలోని బోధనంపాడులో జరిగింది. స్థానిక ఎస్సై ఎం.శివ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఎన్‌ఎస్‌పీ అగ్రహారం గ్రామానికి చెందిన రాతం ఏడుకొండలు (41) బోధనంపాడు సరిహద్దులో ఆదివారం ఉదయం కంది పంట కోసేందుకు మరి కొంతమందితో కలిసి పొలానికి వెళ్లాడు. పొలంలో ఉన్న అడవి పంది ఏడుకొండలుపై దాడి చేయడంతో కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. తోటి వారు ఏడుకొండలును హుటాహుటిన దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏడుకొండలు మృతి చెందాడు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కందుకూరు: పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కాపర్‌వైర్ చోరీ చేసి దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణంలోని వాసవీనగర్ సమీపంలో సిరిచందన లేఅవుట్‌లో గృహాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇళ్లకు విద్యుత్ వైరింగ్ చేయించడంతో పాటు, విద్యుత్‌మోటార్లు బిగించారు. అయితే శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాదాపు ఐదు ఇళ్లకు వేసిన విద్యుత్ వైర్లను పూర్తిగా కత్తిరించి లాక్కెళ్లారు. అలాగే నీటి బోర్లకు బిగించిన మూడు విద్యుత్ మోటార్లను కూడా దొంగిలించారు. దీంత ఇళ్ల నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మోటార్లు, విద్యుత్‌వైర్ల చోరీ ముఠా పలు ప్రాంతాల్లో ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతుందని, వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
ఒంగోలు టౌన్: అతిగా మద్యం తాగిన వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన ఒంగోలులో ఆదివారం జరిగింది. పేర్నమిట్టకు చెంది పెయింటింగ్, ఇతర కూలి పనులు చేసుకుని జీవించే ఎడ్లూరు శ్రీను మద్యానికి బానిసై వివాహం కూడా చేసుకోకుండా తిరుగుతున్నాడు. ఎప్పటిలాగే పనికోసం ఒంగోలు వచ్చి శనివారం రాత్రి తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఆదివారం ఉదయం ఒంగోలు ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న ఒక లాడ్జి సమీపంలో నిర్జీవంగా పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న శ్రీను సోదరుడు కోటేశ్వరరావు ఒంగోలు చేరుకుని మృతదేహాన్ని పేర్నమిట్ట తరలించాడు. కాగా, దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.
కారు దహనం చేసిన దుండగులు
కారు దహనం చేసిన దుండగులు
కారు దహనం చేసిన దుండగులు


