ఆశలు సాగులోకి.. | - | Sakshi
Sakshi News home page

ఆశలు సాగులోకి..

Jan 22 2026 6:53 AM | Updated on Jan 22 2026 6:53 AM

ఆశలు

ఆశలు సాగులోకి..

నష్టాలు వచ్చినా పొగాకు వైపే చూపు 2026–27 సీజన్‌కు సంబంధించి భారీగానే సాగు ఒంగోలు రీజియన్‌ పరిధిలో 82,475 హెక్టార్లలో సాగు గత ఏడాదితో పోల్చితే సాగు తగ్గిందంటున్న బోర్డు అధికారులు ఈ ఏడాది 90.20 మిలియన్‌ కేజీల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి బోర్డు అనుమతికి మించి ఉత్పత్తి అయ్యే అవకాశం ఎకరాకు దిగుబడి తగ్గినా నాణ్యతపైనే ఆశలు పంటను కాపాడుకునేందుకు రైతుల పాట్లు

ధర పొగబెట్టి..

పొగాకు రైతును చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూసింది. వేలం కేంద్రాల్లో అధికారులు బయ్యర్లతో కుమ్మక్కయ్యారు. సాగు సమయంలో రైతులకు కంపెనీలు హామీలు ఇచ్చి కొనుగోలు సమయం నట్టేట ముంచేశాయి. గిట్టుబాటు ధరలు లభించక రైతులు నష్టాల పాలయ్యారు. కనీస ధర కోసం రోడ్డెక్కి ఆందోళన చేశారు. వరుసగా నష్టాలు, కష్టాలు ఎదురవుతున్నా ఈ ఏడాది కూడా సాగులో రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. 2026–27 సీజన్‌కు సంబంధించి సాగైన పంట విస్తీర్ణమే ఇందుకు నిదర్శనం. సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి చేలు తడిపేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సాగు రెట్టింపవుతున్నా ఈ ఏడాదైనా నష్టాల నుంచి బయటపడతామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

జిల్లాలో ప్రధాన పంటగా సాగవుతున్న పొగాకు నష్టాలు తెచ్చిపెడుతున్నా రైతులు భారీగానే సాగు చేశారు. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్‌ పరిధిలో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో 9 కేంద్రాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉండగా, రెండు కేంద్రాలు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. 2026–27 పంట సీజన్‌కు సంబంధించి 11 వేలం కేంద్రాల పరిధిలో 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగైనట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే గత ఏడాదిలో 87,988 హెక్టార్లలో పంట సాగైందని, దీంతో పోల్చితే కొంతమేర సాగు విస్తీర్ణం తగ్గినట్లు అధికారులు చెప్తున్నారు. గతేడాది మిగిల్చిన నష్టాలతో చిన్నా, చితకా రైతులు ఈ ఏడాది సాగు ధైర్యం చేయకపోవడమే ఇందుకు కారణం. అయితే సాగు కాస్త తగ్గినా అంచనాలు మించే పొగాకు పంటను సాగు చేశారని అధికారులు చెప్తున్నారు. గత ఏడాది ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే ఈ ఏడాది అది 6 క్వింటాళ్లకే పరిమితమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి తగ్గినా క్యూరింగ్‌లో మంచి నాణ్యత వస్తుండడం రైతులకు ఈ ఏడాది సానుకూలాంశంగా ఉంది.

90.20 మిలియన్‌ కేజీల ఉత్పత్తికే అనుమతి

2026–27 పంట సీజన్‌కు సంబంధించి ఒంగోలు రీజియన్‌ పరిధిలో 90.20 మిలియన్‌ కేజీల పొగాకు ఉత్పత్తులను పండించేందుకే పొగాకు బోర్డు అనుమతి ఉంది. ఈ మేరకు నల్లరేగడి నేలల పరిధిలో బ్యారన్‌కు 35.65 క్వింటాళ్లు, తేలిక నేలల పరిధిలో 36.85 క్వింటాళ్ల ఉత్పత్తులను మాత్రమే పండించాలని పరిమితి విధించింది. ఇదే గతేడాది 158 మిలియన్‌ కేజీల వరకు ఉన్న దాన్ని ఈ ఏడాది భారీగా తగ్గించారు. బోర్డు అనుమతి ఎలా ఉన్నా ప్రస్తుతం సాగైన విస్తీర్ణాన్ని బట్టిచూస్తే ఏడాది కూడా అంచనాలను మించి ఉత్పత్తి రావచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పంటను కాపాడుకునేందుకు నానాపాట్లు

సాగు చేసిన పొగాకు పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రేయింబవళ్లు పొలాల వద్దే మకాం వేసి నీరు పెట్టుకుంటున్నారు. వర్షాధార పంట కావడంతో ప్రస్తుతం వర్షాలు కురిసే పరిస్థితి లేదు. దీంతో కుంటలు, కాల్వలు, నీటి ట్యాంకర్లపై ఆధారపడి పొలాలను తడుపుకుంటున్నారు. దీంతో సాగు ఖర్చు తడిసిమోడవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరా పొలం విస్తీర్ణంలో రెండు తడులు నీరు పెట్టాలంటే 2 వేల నుంచి 3 వేల అడుగుల మేర పైప్‌లు వేసి ఆయిల్‌ ఇంజన్‌లు పెట్టి నీరు మళ్లిస్తున్నారు. ఇలా ఒక ఎకరా పొలం తడపాలంటే రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఖర్చవుతుందని రైతులు అంటున్నారు. ఇక ట్యాంకర్లతో నీటిని తెచ్చి తోలాలంటే ఈ ఖర్చు రెట్టింపవుతుంది.

ఆశలు సాగులోకి..1
1/2

ఆశలు సాగులోకి..

ఆశలు సాగులోకి..2
2/2

ఆశలు సాగులోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement