ఆర్యవైశ్యుల నిరసన గళం
పొదిలిలో వ్యాపారులపై ఎస్సై దాడికి నిరసనగా ర్యాలీ కదిలిన ఆర్యవైశ్యులు, వ్యాపారులు ఎస్సైని కఠినంగా శిక్షించాలని నినాదాలు దుకాణాలు మూసి వేసి సంఘీభావం
పొదిలి: పట్టణంలోని ఎరువుల వ్యాపారి యాదాల కోటేశ్వరరావు, అతని కుమారుడు అవినాష్‌లను లారీ రోడ్డుపై ఉంచి అన్‌లోడ్ చేయిస్తున్నారనే కారణంతో ఎస్సై వేమన విచక్షణా రహితంగా కొట్టినందుకు నిరసనగా ఆర్యవైశ్యులు, వ్యాపారులు సోమవారం శాంతిర్యాలీ నిర్వహించారు. పట్టణంలో బంద్ పాటించారు. ఆర్యవైశ్యులు, వ్యాపారులు దుకాణాలను మూసి వేసి సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందుగా సీఐ రాజేష్ కుమార్ నిర్వాహకులకు నచ్చచెప్పేందుకు అమ్మవారిశాల వద్దకు వచ్చారు. ఎస్సైపై చర్యలు తీసుకుంటారని, ర్యాలీ విరమించుకోవాలని కోరారు. ఈ సమయంలో బాధితుడు కోటేశ్వరరావు కోడలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ రోడ్డుపై పెట్టి అన్‌లోడ్ చేయిస్తున్నాడని తన భర్తను కొట్టారని, కొడుకు స్టేషన్‌లో ఉన్నాడని వచ్చిన మా మామను కూడా కక్ష కట్టినట్లుగా ఎందుకు కొట్టారో సమాధానం చెప్పాలని నిలదీసింది. ర్యాలీ ఆద్యంతం అవినాష్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అవినాష్‌కు దెబ్బలు తగిలిన ఫొటోలను యువత, మహిళలు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని యువకులు ప్రశ్నించారు. తొలుత పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమ్మవారిశాల వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమైంది. చిన్న బస్టాండ్ నుంచి ప్రధాన రహదారి మీదుగా పెద్ద బస్టాండ్ చేరింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ర్యాలీ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బొగ్గవరపు సుబ్బారావు, మాజీ అధ్యక్షుడు గునుపూడి భాస్కర్ ఇతర సంఘం నాయకులు, బాధితుడు కోటేశ్వరరావుతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ సాజిదాకు వినతిపత్రం అందించారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం దండించవచ్చు. కానీ చిన్న కారణం చూపి ఇంత దుర్మార్గంగా దాడి చేయటం ఎక్కడా జరగలేదని బాధితుడు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనను ఆమె దృష్టికి తీసుకెళ్లాడు. తాను తన కొడుకు స్టేషన్‌లో ఉన్నాడని వెళ్లానని, సార్ ఏమిటి విషయం అనే లోపునే చెంపపై కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకు కొడుతున్నారు అని నేను అడిగేలోపే మళ్లీ, మళ్లీ కొట్టాడన్నారు. అవమానకరంగా అసభ్యకరంగా తిట్టాడని, కారణం ఏమిటో కూడా చెప్పకుండానే శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేశాడని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాగా మరొకరికి జరగకుండా ఎస్సైని కఠినంగా, చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాలని డీటీని అభ్యర్ధించారు. బాధితులకు న్యాయం జరగకపోతే రాష్ట్ర స్థాయిలో ఆర్యవైశ్యులు, వ్యాపారులు మద్దతు కూడగట్టుకుని నిరసనలు చేపడతామని ఆర్యవైశ్య జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్‌వి.కృష్ణారావు చెప్పారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు గునుపూడి సుబ్బారావు, గునుపూడి మధుసూదన్, పందిటి మురళి, యక్కలి శేషగిరిరావు, మేడా నరసింహారావు, వేమా శ్రీనివాసరావు, సతీష్, శ్యాం, మాజీ ఎంపీటీసీ గునుపూడి మాధవి, సోమిశెట్టి శ్రీదేవి, అప్పల శంకర్, కలవా సత్యం, వెంకట రామయ్య, అప్పల సత్యం, భవాని మురళి, శ్రీను, విశ్వనాథపురం నుంచి ఆర్యవైశ్య సంఘం నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.
అసలు ఇంత కక్షతో ఎందుకు కొట్టాడో అర్థం కాలేదు
లారీ డ్రైవర్‌ను ఎస్సై ముందుగా కొట్టాడు. లారీ తీసేయిస్తున్నాను సార్ అనే లోపే లాఠీతో నాపై దాడి చేశాడు. అసలు ఇంత కక్షపెట్టినట్లుగా ఎందుకు కొట్టాడో అర్థం కాలేదు. జీబులో ఎక్కించుకుని కొట్టాడు. స్టేషన్ బయట కూడా కొట్టాడు. చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాను. అక్కడికి కూడా పోలీసులు వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లారు. నా కోసం వచ్చిన నా తండ్రిని విచక్షణా రహితంగా చెంప పగిలేలా ఎస్సై కొట్టాడు. తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని, రాత్రి 12.30 గంటల సమయంలో వదిలేశాడు.
బాధితులకు న్యాయం చేయాలి
అవినాష్, కోటేశ్వరరావులకు న్యాయం చేయాలి. అందుకు కారణమైన ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు సూచనలు చేయాలి.
– బొగ్గవరపు సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు
– బాధితుడు అవినాష్
ఆర్యవైశ్యుల నిరసన గళం
ఆర్యవైశ్యుల నిరసన గళం
ఆర్యవైశ్యుల నిరసన గళం


