వీఆర్‌కు పొదిలి ఎస్సై
సస్పెండ్ చేయాలని ఆర్యవైశ్యుల డిమాండ్ ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేత
ఒంగోలు టౌన్: పొదిలి ఎరువుల వ్యాపారులు, తండ్రి కొడుకులైన యాదాల కోటేశ్వరరావు, అవినాష్ మీద జులుం ప్రదర్శించిన పొదిలి ఎస్సై వేమనపై వేటు పడింది. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆయనను వీఆర్‌కు బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ పొదిలి పట్టణంలోని పాతూరు ప్రధాన రహదారిపై అవినాష్ ఎరువుల దుకాణం ఎదుట లారీ నిలబెట్టి ఉంచి ఎరువుల బస్తాలు అన్‌లోడ్ చేయిస్తుండగా ఎస్సై వేమన అక్కడకు వచ్చారు. వచ్చీ రాగానే లారీ డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. దుకాణం యజమాని అవినాష్‌ను బూతులు తిడుతూ చొక్కా పట్టుకొని కొట్టుకుంటూ పోలీసు జీపులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకొని పోలీసు స్టేషన్‌కు వెళ్లిన అవినాష్ తండ్రి కోటేశ్వరరావుపై కూడా చేయి చేసుకున్నారు. ఈ విషయంపై వ్యాపారవర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. మరుసటి రోజే పొదిలిలో ర్యాలీ నిర్వహించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అయితే ర్యాలీ జరగకుండా అధికార పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. పరోక్షంగా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయినా ఆర్యవైశ్య సంఘం నాయకులు పట్టువిడవలేదు. ఇప్పుడు కనుక మౌనంగా ఉంటే ఆ తరువాత ఇంతకంటే ఎక్కువగా దాడులు జరుగుతాయని, ఇప్పుడే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న తలంపుతో బంద్ పాటించాలన్న నిర్ణయానికే వచ్చారు. సోమవారం పొదిలిలో బంద్ పాటించడమే కాకుండా ర్యాలీగా బయలుదేరి ఒంగోలు చేరుకున్నారు. కలెక్టర్, ఎస్పీలకు వినతి పత్రం అందజేశారు. ఎస్సై వేమనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
వేమన మీద పలు ఆరోపణలు..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొదిలి ఎస్సై వేమన రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నట్లు పలు ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ యాజమానులకు వత్తాసు పలుకుతూ కొందరు లారీ యాజమానులను వేధించడంపై అప్పటి ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. అధికార పార్టీ అండదండలు చూసుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను వీఆర్‌కు పంపించడం పట్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై వేమనను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.


