ఆలయం సమీపంలో మద్యం షాపొద్దు..
చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో మద్యం షాపు ఏర్పాటుకు సన్నాహాలు మాడవీధి పరిధిలో మద్యం దుకాణంపై మహిళల మండిపాటు
మార్కాపురం టౌన్: చరిత్ర ప్రసిద్ధి చెందిన మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ మాడవీధిలో వైకుంఠ ఏకాదశినాడు స్వామివారు దర్శనమిచ్చే ఉత్తర ద్వారానికి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయుడు బజారులోని ఏటీఎం సెంటరు వద్ద మాడవీధి పరిధిలో మద్యం దుకాణానికి ఎకై ్సజ్ శాఖాధికారులు ఎలా అనుమతి ఇస్తారని మండిపడుతున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు నాయుడు బజారు నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూగా ఉండాల్సిన పరిస్థితి. మద్యం దుకాణాన్ని ఏర్పాటుచేస్తే కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో మద్యం ప్రియులు తమ ఆగడాలను ఎక్కువ చేస్తారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మద్యం దుకాణం వద్దని ఎమ్మెల్యే, ఆలయ ఈఓకు వినతిపత్రం
మార్కాపురం పట్టణంలోని నాయుడుబజారులో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో ప్రాంత మహిళలైన శాసనాల సరోజినీ, సరయు, పార్వతీ, క్రిష్ణకుమారి తదితరుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. చెన్నకేశవస్వామి ఉత్తర ద్వారం కేవలం 15 మీటర్ల లోపే ఉందని వివరించారు. ఆ పరిసర ప్రాంతాల్లో నివాస గృహాలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో మద్యందుకాణం ఏర్పాటు చేస్తే పగలు రాత్రి అనే తేడాలే కుండా మద్యం తాగిన అల్లరిమూకలు చేసే ఆగడాలకు అంతులేకుండా పోతుందన్నారు. మార్కాపురం చరిత్రలో నాలుగు మాడవీధుల పరిధిలో మద్యం షాపు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవని వివరించారు. దైవసన్నిధి ప్రాంతంలో షాపు ఏర్పాటు చేయడం హిందూ ధర్మాన్ని అవమానించినట్లే అన్నారు. వినతిపత్రం అందచేసిన వారిలో ఇందిర, సుబ్బారావు, వెంకటరత్నం, సత్యనారాయణ, బాలయ్యతో పాటు సుమారు 20 మంది సంతకాలు చేసి అందజేశారు.


