నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలివ్వాలి
● జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో కలెక్టర్
ఒంగోలు సబర్బన్: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రజలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూ.25,045 కోట్ల రుణాల మంజూరు లక్ష్యంకాగా ఇప్పటి వరకు రూ.16,505 కోట్ల రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారని, నూరు శాతం రుణాలు మంజూరుచేసి లక్ష్యాలను సాధించాలని బ్యాంకర్లకు చెప్పారు. జిల్లాలో పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి గేదెల రుణాల మంజూరు కోసం బ్యాంకులకు పంపారని బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జిల్లాలో పీఎంఈజీపీ పథకం కింద పరిశ్రమల స్థాపనకు 102 దరఖాస్తులు పరిశ్రమ శాఖ నుంచి రుణాల మంజూరు కోసం బ్యాంకులకు పంపించారని, పరిశీలించి వెంటనే మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు, పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస రావు,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమేష్, ఆర్‌బీఐ ఏజీఎం రోహిత్ అగర్వాల్, నాబార్డ్ ఏజీఎం రవికుమార్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


