సాగర్ కాలువకు గండ్లు
త్రిపురాంతకం: నాగార్జున సాగర్ ప్రధాన కాలువ ఎడమ కరకట్టకు ఐదు చోట్ల గండ్లు పడ్డాయి. ఇటీవల తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొండల నుంచి భారీ ప్రవాహం వచ్చింది. నీరు ఉధృతిగా రావడంతో సాగర్ కాలువ కట్ట అక్కడక్కడ దెబ్బతింది. కొండల పై నుంచి వచ్చిన నీరు కరకట్టకు ఆనుకోవడంతో రంధ్రాల నుంచి నీటి ప్రవాహం పెరిగి క్రమేణా కట్ట బలహీన పడింది. తుఫాన్ కారణంగా నీటిని పూర్తిగా తగ్గించడంతో కట్ట కొంత వరకు నిలబడింది. లేకుంటే పూర్తిగా కాలువకట్ట కొట్టుకుపోయేది. పడిన ఐదు గండ్లు ఒకే ప్రాంతంలో పడటంతో సాగర్ అధికారులు వాటి మరమ్మతులను వేగవంతం చేశారు. ఐదు చోట్ల గండ్లు పడినప్పటికి రెండు పెద్దవి కాగా మరో మూడు చిన్నపాటి లీకేజీలు కావడంతో వాటి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. వీటి మరమ్మతులు పూర్తి చేసి నీటిని విడుదల చేయాల్సి ఉంది. సాగర్ జలాశయంలో నీటిని తిరిగి విడుదల చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో నీరు ఒంగోలు ప్రాంతానికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
సాగునీటి కోసం అన్నదాతల ఎదురుచూపులు
నాగార్జున సాగర్ ప్రధాన కాలువ పరిఽధిలో జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇటీవల తుఫాన్ కారణంగా వర్షాలతో సతమతమైన రైతాంగం ఇప్పుడు సాగునీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సాగర్ ఆయకట్టు భూముల్లో వరిపంట సాగు చేస్తున్న రైతాంగం సాగునీటి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా జిల్లాలో ఒక మోస్తరుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో కొంత వరకు వరి ఉందని, లేకుంటే ఇప్పటికే పూర్తిగా పోయేదని అన్నదాతలు చెబుతున్నారు. సాగర్ నీటి సరఫరా కోసం ఎదురుచూస్తున్నందున పటిష్టంగా మరమ్మతు పనులు చేసి నీటిని వెంటనే విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
ఐదు ప్రాంతాల్లో కాలువకు రంధ్రాలు
తుఫాన్ ప్రభావంతో కొండల నుంచి వచ్చిన నీటి ప్రవాహంతో దెబ్బతిన్న సాగర్ కాలువ కట్ట
సాగర్ కాలువకు గండ్లు


