గుర్తుతెలియని మృతదేహం లభ్యం
మద్దిపాడు: మండల కేంద్రమైన మద్దిపాడు శివారులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వెంకట సూర్య తెలిపారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి మృతదేహం మద్దిపాడు శివారు ప్రాంతంలోకి చేరుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహంపై దుస్తులు లేవు. మృతుడు అద్దంకి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఎస్సై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన
కంభం: మూడు తూముల వద్ద కోతకు గురైన అలుగు వాగును ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో వారం రోజులుగా వరద నీరు పారి పంటలు దెబ్బతింటున్నాయని పలువురు రైతులు సోమవారం ఇరిగేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎవరైనా అధికారులు వస్తుంటే సున్నాలు చల్లి హడావుడి చేసే అధికారులు రైతులకు కష్టాలు వస్తే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ కంభం పర్యటనకు వచ్చినప్పుడు కలిసి సమస్యను విన్నవిస్తే ఆయన ముందు పరిష్కరిస్తామని చెప్పిన ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారే తప్ప ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. అలుగు వాగులో చిల్లచెట్లు పెరగడంతో వాగు కోతకు గురై ఇరిగేషన్ కాలువ కోసుకుపోయి పంటపొలాలు నిండిపోయి పసుపు, అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అరటి తోటల్లోనే గెలలు మాగిపోతున్నాయని కోసి మార్కెట్‌కు తరలించాలంటే దారి లేదని దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. మోంథా తుఫాన్ దాటికి దెబ్బతిన్న వాగును, కాలువలను ఇప్పటికి మరమ్మతులు చేయలేదని, మళ్లీ వర్షాలు పడతాయని చెబుతుండటంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.


