నీరుగారిన పాలన..! | - | Sakshi
Sakshi News home page

నీరుగారిన పాలన..!

Nov 4 2025 7:40 AM | Updated on Nov 4 2025 7:42 AM

కూటమి ప్రభుత్వ ఏడాదిన్నర పాలనలో చెరువులు, కాలువల మరమ్మతులు శూన్యం

కనిగిరి రూరల్‌:

నిగిరి నియోజకవర్గం.. అసలే తీవ్ర కరువు ప్రాంతం.. నీటి కోసం నిత్యం కటకటలాడే ఈ ప్రాంతంలో చెరువులన్నీ నిండటమంటే పెద్ద వరమే. గత వారంలో మోంథా తుఫాన్‌కు కురిసిన భారీ వర్షాలకు ఆ కల నెరవేరింది. కొంతకాలం నీటికి ఇబ్బంది ఉండదని ప్రజలంతా భావించారు. చెరువులు, కుంటల్లో నీరు నిలిచి ఉండటం ద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని, పంటల సాగుకు సైతం మేలు జరుగుతుందని రైతులంతా ఆశించారు. కానీ, గత ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వంలో పాలకులు, అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు, కాలువలకు ఎలాంటి మరమ్మతులు నిర్వహించకపోవడంతో గత వారంలో కురిసిన భారీ వర్షాలకు వాటిలో చేరిన నీరంతా వృథాగా పోయింది. ఇంకా పోతూనే ఉంది. కూటమి పాలన డొల్లతనాన్ని ప్రవాహంలా చూపిస్తోంది.

ప్రచార డప్పు మినహా.. క్షేత్ర స్థాయిలో పరిపాలన శూన్యం...

కూటమి ప్రభుత్వంలో ప్రచార డప్పు మినహా క్షేత్ర స్థాయిలో పరిపాలన శూన్యంగా మారింది. కనిగిరి నియోజకవర్గంలో శాశ్వత సాగు, తాగునీటి వనరులు లేవు. వర్షాధారిత పంటల సాగే అధికం. తుఫాన్‌ లాంటి విపత్తులు వచ్చినప్పుడే రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీరు చేరతాయి. ఆ నీటి ప్రభావం వల్లే భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి. ఇళ్లలోని బోర్లకు సైతం నీరు వస్తాయి. రైతుల వ్యవసాయ బోర్లలోనూ నీరు చేరి పంటలకు నీటి తడులు అందిస్తాయన్నది నగ్న సత్యం. అంతేగాకుండా అనేక మంది రైతులు చెరువు ఆయకట్టు కింద పంటలు సాగుచేసుకుంటారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో 135 పంచాయతీల్లో చెరువులున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు, మోంఽథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దాదాపు అన్ని చెరువులూ నీటితో నిండాయి. కానీ, చెరువులపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోగా, నిర్లక్ష్యంగా వదిలేసినందున దాదాపు అన్ని చెరువులకూ గండ్లు ఉన్నాయి. దీంతో చాలా నీరు వృథాగా పోతోంది.

చెరువుల మరమ్మతులు, అభివృద్ధికి రూపాయి ఖర్చు చేయని దుస్థితి...

మోంథా తుఫాన్‌ ప్రభావంతో చాలా ఏళ్ల తర్వాత కనిగిరి నియోజకవర్గంలోని పందువ గండి, పునుగోడు రిజర్వాయర్లలో నీరు చేరింది. కానీ, లీకులతో బయటకు వెళ్లిపోయింది. ఎన్‌.గొల్లపల్లి రిజర్వాయర్‌లోని నీరు తూము షట్టర్‌ లీకులతో, అలుగు రంధ్రాల లీకులతో వృథాగా పోయింది. రాళ్లపల్లి, కూలికుంట్ల పంచాయతీలోని నడిమి చెరువుకు వెలిగొండ కొండపై నుంచి జోరుగా నీరు రావడంతో కట్టలు తెగే పరిస్థితి నెలకొంది. చెరువు, అలుగు వాగు, కాలువలన్నీ చిల్లచెట్లతో నిండిపోయాయి. ఇమ్మడి చెరువు, ఇతర అనేక చెరువుల్లో నీరు వృథాగా పోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు చెరువుల మరమ్మతులు, అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడం వలనే ఈ దుస్థితి నెలకొంది.

రైతుల కన్నీటి ఘోష...

కనిగిరి ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువులకు గండ్లుపడి అల్పపీడనం, తుఫాన్లు, అకాల వర్షాల ప్రభావంతో చేరిన నీరంతా వృథాగా వెళ్లిపోతోంది. ప్రభుత్వం, అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో రిజర్వాయర్లు, చెరువుల్లోని నీరు కళ్లముందే వృథా అవుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ప్రశ్నించినా.. రైతు సంఘాల నాయకులు అధికారులు, పాలకులను అడిగినా స్పందన లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైనా నేటికీ చెరువుల అభివృద్ధికి ఒక్క రూపాయి విదిల్చిన పాపన పోలేదు. ఇటీవల మోపాడు రిజర్వాయర్‌కు నిధులు మంజూరు చేసినా పనులు జరగడం ప్రశ్నార్థకంగా ఉంది. 100 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న చెరువులు నియోజకవర్గంలో సుమారు 55 వరకు ఉన్నాయి. కనీసం వాటికి కూడా నిధులు మంజూరు చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

దెబ్బతిన్న రిజర్వాయర్ల తూములు, షట్టర్లు...

నియోజకవర్గంలో 100 ఎకరాల ఆయకట్టు ఉన్న మైనర్‌ చెరువులు 55 వరకు ఉండగా, మోపాడు రిజర్వాయర్‌ ఉంది. కనిగిరి మండలంలో పునుగోడు, ఎన్‌.గొల్లపల్లి రిజర్వాయర్‌తో కలిపి 13 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు ఉండగా, 100 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 30 వరకు ఉన్నాయి. ఇక 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులు పామూరులో 7, హెచ్‌ఎం పాడులో 3, వెలిగండ్లలో 8, పీసీ పల్లిలో 10, సీఎస్‌ పురంలో 12 వరకు ఉన్నాయి. ఇవి కాక సుమారు 100కుపైగా చిన్న చెరువులు ఉన్నాయి. వీటన్నిటికీ తూములు, షట్టర్లు దెబ్బతిని అధ్వానంగా ఉండటంతో నీరు నిలవడం లేదు.

అవసాన దశలో చెరువులు...

కనిగిరి నియోజకవర్గంలో మోపాడు రిజర్వాయర్‌ (12 వేల ఎకరాల ఆయకట్టు) తర్వాత మైనర్‌ రిజర్వాయర్లుగా ఎన్‌.గొల్లపల్లి (2,500 ఎకరాల ఆయకట్టు), పునుగోడు (2 వేల ఎకరాల ఆయకట్టు), పందువ గండి (1,000 ఎకరాలకుపైనే ఆయకట్టు) రిజర్వాయర్లు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. నేలటూరి గొల్లపల్లి రిజర్వాయర్‌కు పూర్తిగా కట్ట, తూము, షట్టర్లు, కాలువలు అవసాన దశకు చేరాయి. తూము షట్టర్‌ పూర్తిగా విరిగిపోయింది. తూము వాల్స్‌ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. లీకుల ద్వారా నీరు ఉధృతంగా బయటకు పారకుండా ఇసుక బస్తాలు అడ్డుపెట్టి అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. రెండు ప్రధాన కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పిచ్చి చెట్లు నిండి గోడలు నెర్రెలిచ్చాయి. ఇక, పునుగోడు రిజర్వాయర్‌ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ చెరువు ఆయకట్టు షట్టర్‌ తుప్పుపట్టి విరిగిపోయి నిరుపయోగం మారింది. రిజర్వాయర్‌ కట్ట గోడలకు రంధ్రాలు పడి చెట్లు మొలిచాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి గోడలు నెర్రెలుబారి ఉన్నాయి. కలగట్ల, జమ్మలమడక చెరువు కట్ట కూడా మెత్తబడింది. ఇలా అనేక చెరువులు మరమ్మతులకు నోచుకోక అవసాన దశలో ఉన్నాయి.

ప్రతిపాదనలు పంపినా నిధులు

కేటాయించని ప్రభుత్వం

ప్రధాన రిజర్వాయర్లను సైతం

గాలికొదిలేసిన వైనం

కరువు ప్రాంతమైన కనిగిరి

నియోజకవర్గంలోనూ నీటి వృథాపై

తీవ్రస్థాయిలో విమర్శలు

ఈ పాపం కూటమి ప్రభుత్వానిదేనంటున్న రైతులు, ప్రజలు

దీని ప్రభావం భూగర్భ జలాలపై కూడా పడుతుందని ఆందోళన

ఇరిగేషన్‌ అధికారులు

ఏమంటున్నారంటే...

చెరువుల దుస్థితిపై ఇరిగేషన్‌ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా, పునుగోడు, నేలటూరి గొల్లపల్లి, పందువ గండి, రాళ్లపల్లి షట్టర్లు, తూములు, అలుగు గోడలు దెబ్బతిన్నది వాస్తవమేనని అన్నారు. ఎన్‌.గొల్లపల్లి రిజర్వాయర్‌ మరమ్మతులకు రూ.46 లక్షలతో ప్రతిపాదనలు పంపామన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువుల మరమ్మతులకు, జంగిల్‌ క్లియరెన్స్‌కు, అభివృద్ధి పనులకు చెరువును బట్టి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. నిధులు మంజూరు చేస్తే పనులు చేయిస్తామని తెలిపారు.

మోంథా తుఫాన్‌కు చెరువులన్నీ నిండినా.. మరమ్మతుల కారణంగా వృథాగా పోయిన నీరు

నీరుగారిన పాలన..! 1
1/3

నీరుగారిన పాలన..!

నీరుగారిన పాలన..! 2
2/3

నీరుగారిన పాలన..!

నీరుగారిన పాలన..! 3
3/3

నీరుగారిన పాలన..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement