ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ కార్యకలాపాలు
● చోద్యం చూస్తున్న అధికారులు
యర్రగొండపాలెం: మండల పరిషత్ కార్యాలయాన్ని టీడీపీ నాయకులు తమ పార్టీ కార్యాలయంగా మార్చుకుంటున్నారు. పుల్లలచెరువు ఎంపీడీవో ఆఫీస్‌లో టీడీపీ మండల అధ్యక్షుడిగా నియమితుడైన పోట్ల గోవిందు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సన్మానం చేయించుకున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు అధికారులు సైతం మండల టీడీపీ నాయకుడి మెహర్బానీ కోసం ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆయనకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. అధికార మదంతో టీడీపీ వర్గీయులు అధికారుల అనుమతి లేకుండానే తమ పార్టీ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఆయా మండలాల్లో ఉన్న మండల పరిషత్ కార్యాలయాల్లో ఎటువంటి అధికారిక అర్హతలేని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పెత్తనం చెలాయిస్తూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవడం, ఏకంగా ఎంపీడీవో కుర్చీ పక్కనే కుర్చీ వేసుకొని తమ పార్టీ నాయకులతో బాతాఖానీ లాంటివి చేస్తుంటే తామేమీ తక్కువ కాదని ఆయా మండలాల టీడీపీ నాయకులు సైతం మండల పరిషత్ కార్యాలయాలను తమ పార్టీ వేదికలుగా మలుచుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ కార్యాలయాలకు పచ్చ రంగు పులిమి కార్యకర్తల సమావేశాలు కూడా నిర్వహించుకుంటారని ఆ పార్టీకి చెందినవారే గుసగుసలాడుకుంటున్నారు.
● పోలీసు గ్రీవెన్స్‌లో ఎస్పీకి
మొర పెట్టుకున్న బాధితులు
ఒంగోలు టౌన్: ఫైనాన్స్, చీటిపాటల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారంటూ పలువురు బాధితులు పోలీసు గ్రీవెన్స్‌లో ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు సోమవారం ఫిర్యాదు చేశారు. మొత్తం 117 మంది ఫిర్యాదుదారులు ఎస్పీకి ఫిర్యాదులు అందజేశారు. కొత్తపట్నం మండలానికి చెందిన ఒక వ్యక్తి వ్యక్తిగత అవసరాల నిమిత్తం వడ్డీ లేకుండా రూ.5 లక్షలు తీసుకున్నాడు. అందుకుగాను తన ఇంటి డాక్యుమెంట్లు ఇచ్చాడు. తీరా ఇప్పుడు డబ్బులు ఇస్తాము, ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వమని అడుగుతుంటే స్పందించడం లేదు. అసలు రూ.5 లక్షలకు అదనంగా రూ.10 లక్షలు చెల్లిస్తేనే ఇంటి డాక్యుమెంట్లు ఇస్తానంటూ వేధిస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
పుల్లలచెరువు మండలానికి చెందిన మరో వ్యక్తికి ఇదే సమస్య. సదరు వ్యక్తి తన ఇంటిని ఒక ఫైనాన్స్ కంపెనీ వద్ద తనఖా పెట్టి రూ.2.30 లక్షల రుణం తీసుకున్నాడు. దానికి ప్రతి నెలా రూ.7,228 చెల్లిస్తున్నాడు. రెండేళ్లుగా ఈఎంఐలు చెల్లిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి రసీదులు ఇవ్వలేదని, ఇంకా బాకీ ఉందని బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మార్కాపురానికి చెందిన ఒక వ్యక్తి చీటీ పాటల పేరుతో అదే పట్టణానికి చెందిన వ్యక్తి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశాడు. చీటీ పాడుకున్న తరువాత డబ్బులు చెల్లించకుండా మోసం చేశాడు. ఫిర్యాదుల మీద వెంటనే స్పందించిన ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా పోలీసు స్టేషన్ అధికారులతో మాట్లాడారు. తక్షణ విచారణ చేపట్టి చట్టప్రకారం బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వీవీ రమణ కుమార్, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ దుర్గా ప్రసాద్, ఒన్‌టౌన్ సీఐ నాగరాజు, దర్శి సీఐ రామారావు, మార్కాపురం సీఐ సుబ్బారావు, కొండపి సీఐ సోమశేఖర్ , ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్ధన్ రావు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ కార్యకలాపాలు


