బీసీలతో పెట్టుకుంటే మూల్యం తప్పదు | - | Sakshi
Sakshi News home page

బీసీలతో పెట్టుకుంటే మూల్యం తప్పదు

Nov 4 2025 7:42 AM | Updated on Nov 4 2025 7:42 AM

బీసీలతో పెట్టుకుంటే మూల్యం తప్పదు

బీసీలతో పెట్టుకుంటే మూల్యం తప్పదు

టీడీపీ నాయకులను రక్షించడానికి మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేయడం అన్యాయం వైఎస్సార్‌ సీపీ గౌడ్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహ గౌడ్‌ విమర్శ

ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల మీద దాడులు ఎక్కువయ్యాయని, బీసీలతో పెట్టుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గౌడ్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహ గౌడ్‌ హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ మంత్రి, బీసీ నాయకుడు జోగి రమేష్‌ను కల్తీ మద్యం కేసులో అక్రమంగా అరెస్టు చేశారని, ఇది కూటమి ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని, కేసులో ఉన్న అసలు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వైఎస్సార్‌ సీపీ నాయకులను అరెస్టు చేయడం కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కోర్టులో కేసు వేశారని, నేడో రేపో తీర్పు వస్తున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్‌ను అరెస్టు చేశారని చెప్పారు.

వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులతో వేధిస్తున్నారని, చంద్రబాబు చరిత్రలో బీసీ ద్రోహిగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. జగనన్న పాలనలో బీసీలకు 50కి పైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అధికారంలో భాగస్వాములను చేశారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కురుముల లింగయ్య హత్య జరిగిందని, బీసీ నాయకులైన ఎమ్మెల్సీ రమేష్‌, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పుప్పాల హరిత మీద దాడులు జరిగాయని తెలిపారు. కల్తీ మద్యం కేసు గురించి టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ మోహన్‌.. గౌడ కులం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. తుపాను బాధితులను సకాలంలో ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రుభుత్వం, కాశిబుగ్గలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు సాయం చేయడంలో వైఫల్యం చెందిన కూటమి పాలకులు మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేసి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నోరు విప్పి మాట్లాడడంలేదన్నారు.

వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత కనిపించినప్పుడల్లా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. గౌడ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఎదిగిన జోగి రమేష్‌ను అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శి సాదం విజయలక్ష్మి, బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు సూతరం శ్రీనివాసులు, ఫణిదెం సుధాకర్‌ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు పిగిలి శ్రీనివాసరావు, వీసం బాలకృష్ణ, షేక్‌ జిలానీ, ఉప్పలపాటి ఏడుకొండలు, మొద్దు ప్రతాప్‌, యరజర్ల రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement