మోంథా తుపానుకు ముందస్తు చర్యలు శూన్యం
నాలుగు రోజుల ముందుగా హెచ్చరించినా డ్రైనేజీ వ్యవస్థలో అడ్డంకులు తొలగించలేదు వీవీ ఇన్‌ఫ్రా కాంట్రాక్టర్‌కు పోటీగా ఎవరు టెండర్ వేసినా రద్దు చేస్తున్నారు నగర కౌన్సిల్‌లో వైఎస్సార్ సీపీ సభ్యుల ధ్వజం ట్రంకురోడ్డు వ్యాపారుల విషయం హైకోర్టులో ఉంటే కౌన్సిల్ ఆమోదానికి ఏ విధంగా పెడతారని ఆగ్రహం అధికార పార్టీలోని టీడీపీ, జనసేన సభ్యుల్లోనే భిన్నాభిప్రాయాలు
ఒంగోలు సబర్బన్: మోంథా తుపాను విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవటంలో ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు వైఫల్యం చెందారని వైఎస్సార్ సీపీ సభ్యులు ధ్వజమెత్తారు. నాలుగు రోజుల ముందుగానే రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ఒంగోలులోని డ్రైనేజీల్లో అడ్డంకులు తొలగించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దాంతో భారీ వర్షాలకు నగరం జల ప్రళయంగా మారి ప్రజలు నానా అవస్థలు పడ్డారని ధ్వజమెత్తారు. నగర మేయర్ జీ.సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌లో 75 అంశాలను ఆమోదానికి పెట్టారు. వాటిలో మూడు వాయిదా వేయగా ఏడు రద్దు చేశారు. ప్రధానంగా తుపాను ముందస్తు చర్యల మీదనే చర్చ సుదీర్ఘంగా జరిగింది. తుపానుకు సంబంధించి కనీసం కార్పొరేటర్లతో సంప్రదించలేదని, ఏ ప్రాంతంలో ఏ అధికారి పనిచేస్తున్నారో కూడా చెప్పకపోవటం దారుణమని వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వాతావరణ శాఖ నాలుగు రోజుల ముందుగానే మోంథా తుపాను విషయాన్ని హెచ్చరించిందన్నారు. అయినా అధికారులు నగరంలోని ప్రధాన డ్రెయిన్లలో ఉన్న అడ్డంకులను తొలగించలేదన్నారు. దాంతో ననగంలో 30కి పైగా కాలనీలు నీటమునిగాయని గుర్తు చేశారు. 20 వేల మంది బాధితులు ఉంటే కేవలం 7 వేల మందికి మాత్రమే భోజనాలు ఏర్పాటు చేశామనటం విడ్డూరంగా ఉందన్నారు. బాధితులకు ఆర్థిక సాయం చేయలేదన్నారు. ఇళ్లు బురదమయంగా మారి, పనులకు వెళ్లే అవకాశం కూడా లేకుంటే బాధితులకు ఆర్ధిక సాయం చేయలేకపోతే వాళ్లు ఏవిధంగా జీవనం సాగించాలని నిలదీశారు.
హైకోర్టు పరిధిలోని అంశాలన్నీ
కౌన్సిల్ ఆమోదానికి పెడతారా..
ట్రంకు రోడ్డు విస్తరణలో భాగంగా 100 అడుగులు విస్తరణ మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయాలని అధికారులు తలంచారు. అయితే అందుకు ట్రంకు రోడ్డు వ్యాపారులు అంగీకరించలేదు. దాంతో దాదాపు 120 మందికి పైగా హైకోర్టుకు వెళ్లారని వైఎస్సార్‌సీపీ సభ్యులతో పాటు అధికార పార్టీలోని జనసేన నాయకుడు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవ రావులు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఏ విధంగా కౌన్సిల్ ఆమోదానికి పెడతారని నిలదీశారు. తుపాను ముందస్తు చర్యల విషయంలో, ట్రంకు రోడ్డు వ్యాపారుల విషయంలో అధికార టీడీపీ, జనసేన సభ్యుల మధ్యలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వారి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ టీడీపీకి, అధికారులకు ఇష్టమైన కాంట్రాక్టర్ వీవీ ఇన్‌ఫ్రాకు టెండర్లలో ఎవరైనా పోటీగా వెళ్లి టెండర్‌లో లెస్‌కు వేస్తే ఆ టెండర్‌లను ఎందుకు రద్దు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ నిలదీశారు. వీవీ ఇన్‌ఫ్రాకు పోటీగా ఎవరూ టెండర్లు వేయకూడదా అని నిలదీశారు. దానికి టీడీపీ సభ్యులు అడ్డుకొని ఏడు టెండర్ల రద్దుకు టీడీపీ సభ్యులు అంగీకరించారు. డబ్బులు లేకుండా వర్కులకు టెండర్లు ఏవిధంగా పిలుస్తున్నారని డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు ప్రశ్నించారు. ఇప్పటికే పాత వర్కులకు దాదాపు రూ.40 కోట్లు బకాయిలు ఉన్నాయని, ప్రస్తుతం జరుగుతున్న పనులు దాదాపు రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు ఉన్నాయన్నారు. మరో రూ.30 కోట్లకు టెండర్లు పిలిస్తే డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చిస్తారని ప్రశ్నించారు. కొప్పోలులో రూ.1.30 కోట్లతో మంచినీటి పైపులైన్లు వేశారు. కానీ ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని, ఖర్చు చేసిన డబ్బు వృథాగా పోయిందని కొప్పోలు కార్పొరేటర్ బంగుళూరు నర్సయ్య ధ్వజమెత్తారు.
19వ డివిజన్ కార్పొరేటర్ ఈదర సురేష్ మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యల మీద మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు లేచి అడ్డుకోవటం మానుకోవాలని సురేష్ అన్నారు. నగరానికి దక్షిణం వైపున నల్లవాగు, ఉత్తరం పోతురాజు కాలువలు ఉన్నాయని, ఎగువ భాగంగా డ్రైనేజీని డైవర్షన్ చేస్తే నగరంలోని లోతట్టు ప్రాంతాలపైకి వరద నీరు రాకుండా చూసుకోవచ్చన్నారు. వెంగముక్కల పాలెం జంక్షన్ నుంచి క్విస్ కాలేజీ సమీపంలో ఉన్న నల్ల వాగుకు డ్రైనేజీని మళ్లిస్తే హౌసింగ్ బోర్డు, భాగ్యనగర్ రామ్ నగర్ ప్రాంతాలకు వరద ప్రభావం అంతగా ఉండదన్నారు. అదేవిధంగా దక్షిణ బైపాస్‌లో పాత కల్వర్టు ఉందని దాని గుండా సక్రమంగా నీళ్లు పోవటం లేదన్నారు. దానిని పెద్దది చేసి తూర్పునకు నీటిని వదిలితే సులభంగా ఉంటుందని సురేష్ వివరించారు. సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏసీపీ సుధాకర్, ఎంఈ ఏసయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


