బండ్లమూడి దళితులపై అగ్రవర్ణాల దాడి
● పోలీసుల సమక్షంలోనే దళితులను
చితకబాదిన అగ్రవర్ణాలు
చీమకుర్తి రూరల్/ఒంగోలు టౌన్: చీమకుర్తి మండలంలో అగ్రవర్ణాల వారు రెచ్చిపోయారు. పోలీసుల సమక్షంలోనే దళితులను చితకబాదారు. ఈఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన దళితులైన కంఠ్లం ఏసుదాసు అన్నదమ్ముల కుటుంబ సభ్యులకు పొలం ఉంది. దాంట్లో ఉన్న సవకులను పాలగిరి సుబ్బారెడ్డికి చెందిన గొర్రెలు మేశాయి. ఈ విషయం గురించి అడగడానికి ఏసుదాసు కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బండ్లమూడి గ్రామంలోకి వచ్చారు. పాలగిరి సుబ్బారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి పొలంలో జరిగిన నష్టం గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఏసుదాసు చీమకుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సీఐ ప్రసాద్ ఒక కానిస్టేబుల్‌ను వెంట పంపించారు. అప్పటికే సుబ్బారెడ్డితోపాటుగా వనిపెంట శ్రీనివాసరెడ్డి, వనిపెంట రమణా రెడ్డి, కామారెడ్డి, పెద్దారెడ్డితోపాటుగా మరో 20 మందితో కలిస దళితుల మీద దాడికి సిద్ధం చేసుకున్నారు. పోలీసు కానిస్టేబుల్‌తో వచ్చిన కంఠ్లం ఏసుదాసు, కంఠ్లం ఏసేబు, రామయ్య, ఎలిశమ్మలపై కర్రలు, మారణాయుధాలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే దళితులను, మహిళలను చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఏసుదాసు కుటుంబ సభ్యులను వెంటనే ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. దళితులపై దాడి చేసిన సుబ్బారెడ్డి, తదితరులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
దాడిచేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి:
బండ్లమూడి మాదిగలపై మారణాయుధాలతో దాడి చేసిన అగ్రవర్ణాల వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సృజన్ డిమాండ్ చేశారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బండ్లమూడి దళితులను ఆయన పరామర్శించారు. పోలీసుల సమక్షంలోనే మాదిగలపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డిలతో పాటుగా మిగిలిన 20 మందిపై హత్యాయత్నం కేసుతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధిత గ్రామాన్ని తక్షణమే జిల్లా కలెక్టర్, ఎస్పీ సందర్శించిన దళితులకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


