
కలెక్టర్‌ను కలిసిన గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డీడీ
ఒంగోలు సబర్బన్: కలెక్టర్ పీ.రాజాబాబును గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని కలెక్టర్ చాంబర్‌లో మంగళవారం కలిసిన ఆమె కలెక్టర్‌కు మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరి అధికారుల మధ్య టైగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, నల్లమల ప్రాజెక్టులో పర్యాటక అభివృద్ధి అంశాలపై మాట్లాడారు.
చీమకుర్తి: గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల సమ్మె విరమిస్తున్నట్టు ఫ్యాక్టరీల యజమానుల యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. గత 14 రోజుల నుంచి చేస్తున్న సమ్మెను విరమించి బుధవారం నుంచి ఫ్యాక్టరీలను తిరిగి నడపనున్నట్లు యజమానులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు విజయవాడలోని మైన్స్ మంత్రిని కలిశారు. గ్రానైట్ రాయల్టీ వసూళ్లలో ప్రైవేటు ఏజెన్సీ ఏఎంఆర్ కంపెనీ వారు ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీకి రెట్టింపు డబ్బులు అనధికారికంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సూచనల మేరకు మంగళవారం సమ్మెను విరమించాలని సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేలు బీఎన్ విజయకుమార్, కందుల నారాయణరెడ్డి మంగళవారం చీమకుర్తిలోని ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్‌లో గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులతో సమావేశమయ్యారు. అనంతరం సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు.