
అమాయకులపైనా మీ దాష్టికం?
గిద్దలూరు రూరల్: గిద్దలూరు అటవీశాఖ అధికారులు అమాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని బేస్తవారిపేట మండలం పొగుళ్ల గ్రామస్తులు కొందరు ఆరోపించారు. పోగుళ్లకు చెందిన మేకల తిమ్మయ్యపై అక్రమ కేసు నమోదు చేసి నిర్బంధించారంటూ గిద్దలూరు రేంజ్ అటవీ శాఖ కార్యాలయం వద్ద అతని బంధువులు గురువారం ఆందోళన చేశారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. పోగుళ్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 20 రోజుల క్రితంతిమ్మయ్య ఒక కొండముచ్చును చంపాడంటూ అటవీశాఖ అధికారులు విచారణకు వెళ్లారు. దీంతో అతను గ్రామ పెద్దలను ఆశ్రయించగా రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డితో చర్చించారు. తిమ్మయ్యను తీసుకొస్తే మాట్లాడి పంపిస్తామని చెప్పడంతో బుధవారం అటవీశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. గురువారం వరకు తిమ్మయ్యను విడిచిపెట్టకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ మీకు ఏమీ కాదు అని చెప్పి రేంజ్ ఆఫీసర్ మా వద్ద రూ.50 వేలు వసూలు చేశారు. ఏమైందో ఏమో వణ్యప్రాణిని చంపారు, నాటు తుపాకీ దొరికింది’ అని ఇప్పుడు చెబుతున్నారు. కొండముచ్చును రేచు కుక్కలు చంపి పడేస్తే.. తిమ్మయ్య తుపాకీతో కాల్చి చంపాడని బలవంతంగా ఒప్పించి కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, ఇంత అన్యాయమా అని వాపోయారు. కార్యాలయంలోకి ఎవరు రాకుండా తలుపులు వేయడంపై తిమ్మయ్య బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సత్యనారాయణరెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. శ్రీకేసు వివరాలు రాస్తున్నా, ఇప్పుడు నేను ఎవరినీ కలవలేనుశ్రీ అని సిబ్బందితో సమాధానం చెప్పించారు.
అటవీశాఖ అధికారుల తీరుపై పోగుళ్ల వాసుల ఆందోళన
అక్రమ కేసులు బనాయించారని ఆరోపణ