
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోవాలి
ఒంగోలు సిటీ: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఈ నెల 22 నుంచి నవంబర్ 12 వరకు జరుగుతున్న బస్సుజాతలో విద్యార్థులంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుల్లాయిస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్ పిలుపునిచ్చారు. ఒంగోలులోని లింగయ్య భవన్‌లో గురువారం బస్సుజాత వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీపీ విధానాన్ని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యను కాపాడాలని, మూసివేసిన పాఠశాలలను పునఃప్రారంభించాలని తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీ అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువుకున్న దూరం చేసే జీఓ నంబర్ 77 రద్దు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 3480 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టల్‌లో మౌలిక వసతులు కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో జూనియర్ కళాశాలలు, నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బస్సు జాతాలో భాగంగా నవంబర్ రెండవ తేదీన ఒంగోలు పట్టణంలోకి వస్తామని, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నాయకులు తాహిద్, ఇఫ్రాజ్, లోకేష్, స్టాలిన్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
మూతపడిన పాఠశాలలను పునఃప్రారంభించాలి
ఎన్నిక హామీ మేరకు 107, 108, 77 జీఓలను రద్దు చేయాలి
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుల్లాయిస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్