
నల్లమలను జల్లెడ పట్టిన బలగాలు
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం వెళ్లే వాహనాల నిలిపివేత ఇబ్బందులు పడిన యాత్రికులు
పెద్దదోర్నాల: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీశైలం పర్యటనతో నల్లమల అటవీ ప్రాంతాన్ని గ్రేహాండ్ బలగాలు, పోలీసులు జల్లెడ పట్టారు. గురువారం ఉదయం కర్నూలులోని ఓర్వకల్లుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న నరేంద్ర మోదీ.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నంద్యాల జిల్లా సున్నిపెంట చేరుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు నల్లమల అభయారణ్యంలోని ప్రతి ప్రాంతాన్ని గ్రేహాండ్ దళాలు జల్లెడ పట్టాయి. దీంతో పాటు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా భద్రతను పర్యవేక్షించారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రతి 10 కిలోమీటర్లకు ఓ సెక్యూరిటీ పాయింట్ ఏర్పాటు చేశారు. ప్రతి పాయింట్‌లో ఓ ఇన్‌స్పెక్టర్‌తో పాటు 8 మంది పోలీసులను ఉంచి నల్లమలలో సంచరించే వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. దీంతో పాటు అభయారణ్యంలోని ముఖ్యమైన ప్రాంతాలలో వాహనాలు మరమ్మతులకు గురై రోడ్లపై నిలిచిపోగా, ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా క్రేన్లు, బుల్‌డోజర్లు ఏర్పాటు చేసి తొలగించారు. మండల కేంద్రంలోని గణపతి చెక్‌పోస్టు నుంచి శిఖరం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మొబైల్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. కాగా, మండల కేంద్రంలోని మల్లికార్జుననగర్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వెళ్లే వాహనాలను నిలిపివేయడంతో ప్రయాణికులు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులు భోజన వసతి కోసం అవస్థపడ్డారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు, యర్రగొండపాలెం సీఐ ప్రభాకర్‌రావు, ఎస్సై మహేష్‌లు మండలంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.