అభివృద్ధి ముసుగేస్తూ! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ముసుగేస్తూ!

Sep 12 2025 6:33 AM | Updated on Sep 12 2025 6:33 AM

అభివృద్ధి ముసుగేస్తూ!

అభివృద్ధి ముసుగేస్తూ!

స్థలాలు కొట్టేస్తూ.. అభివృద్ధి ముసుగేస్తూ!

శ్రీకృష్ణ యాదవ భవనం స్థలం రద్దు దశరాజుపల్లి రోడ్డులోని ఖబరస్థాన్‌ స్థలంపై కన్ను అభివృద్ధి పేరుతో ట్రంకు రోడ్డు వ్యాపారులపై పెత్తనం బండ్లమిట్టలో అక్రమ నిర్మాణాల జోలికెళ్లని కార్పొరేషన్‌ అధికారులు నేడు ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం

స్థలాలు కొట్టేస్తూ..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు నగరవాసులు నయవంచనకు గురవుతున్నారు. ఒకవైపు అభివృద్ధి పేరుతో మాయాజాలం చేస్తుండగా, మరోవైపు వర్గాల వారీగా ప్రజలను పాలకులు మోసం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మాటలకు అధికారులు తందానా అంటున్నారు. శుక్రవారం జరగనున్న కౌన్సిల్‌ సమావేశం వేదికగా పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. నగరంలోని ట్రంక్‌ రోడ్డు విస్తరణకు సంబంధించి గత కౌన్సిల్‌ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ గట్టిగా వ్యాపారుల పక్షాన నిలిచింది. అలాగే ట్రంక్‌ రోడ్డు బాధితులు, వ్యాపారులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దాంతో రీహాబిలిటేషన్‌ అండ్‌ రీ సెటిల్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద బాధితులను నగదు రూపంలో ఆదుకోవాలని నగరపాలక సంస్థకు హైకోర్టు సూచించింది. 73 మంది బాధితులను నగదు రూపంలో ఆదుకోవాలని ఉత్తర్వులిచ్చింది. ట్రంకు రోడ్డులో వ్యాపారులు అన్ని రకాల అనుమతులు తీసుకుని ఒంగోలు నగరపాలక సంస్థకు అన్నిరకాల పన్నులు చెల్లిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇన్‌కం ట్యాక్సు, జీఎస్‌టీ, ఇతర అన్ని ప్రభుత్వ విభాగాలకు చెల్లించాల్సిన పన్నులు చెల్లిస్తున్నారు. టీడీఎస్‌ బాండ్లు ఇస్తాము.. రూ.కోట్ల విలువ చేసే స్థలాలు రోడ్డు విస్తరణకు ఇవ్వండని మున్సిపల్‌ అధికారులు వేధిస్తున్నారు. అందుకే కోర్టు మెట్లెక్కి బాధితులు ఆర్డర్‌ తీసుకొచ్చారు.

వారికో న్యాయం.. వీరికో న్యాయమా..?

ట్రంకు రోడ్డు విస్తరణలో ప్రాపర్టీ కోల్పోయే వారంతా కూడా ప్లాన్‌ అప్రూవల్‌ కోసం మున్సిపల్‌ శాఖకు పన్నులు, లేబర్‌ సెస్‌ వగైరా చెల్లించారు. అలాగే ప్రాపర్టీ, కొళాయి పన్ను చెల్లిస్తున్నారు. వీళ్లకే నోటీసులిచ్చి మరీ కూలగొట్టేందుకు నగర పాలక సంస్థ అధికారులు మార్కింగ్‌ కూడా ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ప్లాన్‌ చార్జీగానీ, లేబర్‌ సెస్‌గానీ చెల్లించకుండా బండ్లమిట్ట – అద్దంకి బస్టాండ్‌ రోడ్డులో భారీ కాంప్లెక్స్‌లు నిర్మించుకుని రూ.లక్షల్లో అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. వారి వైపు కార్పొరేషన్‌ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ, బినామీ పట్టాలతో భారీ కాంప్లెక్స్‌లు నిర్మించుకుని రూ.లక్షల్లో అద్దెలు తీసుకుంటుండగా.. నేటికీ ఇంకొన్ని నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ముందువైపు కాకుండా రోడ్డుకు వెనుక ఊరచెరువు వైపు చూస్తే ఒక్కొక్క బిల్డింగ్‌ లోతు 250 నుంచి 300 అడుగులు సొరంగాల మాదిరిగా ఉన్నాయి. బండ్లమిట్ట–అద్దంకి బస్టాండ్‌ (ట్రావెలర్స్‌ బంగళా రోడ్‌) 100 అడుగుల రోడ్డు కాస్తా 40 అడుగుల వరకు అక్రమ నిర్మాణాలతో కుంచించుకుపోయింది. మరి అధికారులు వాటిజోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

యాదవ భవన స్థలం రద్దు దుర్మార్గం...

శ్రీకృష్ణ కళ్యాణ మండపం, యాదవ భవనానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 19వ డివిజన్‌లో స్థలం కేటాయించారు. దాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు రద్దు చేశారు. ఆ స్థలంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ విషయం తెలుసుకుని ఆలిండియా యాదవ మహాసభ నాయకులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లను కలిస్తే యాదవ భవన్‌, కళ్యాణ మండపానికి ఆ స్థలం ఇచ్చిన విషయం తెలియదని చెప్పుకొచ్చారు. చివరకు యాదవ భవన్‌కు ఇచ్చిన స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్డర్‌ కూడా జారీ చేసింది. గతేడాది ఏప్రిల్‌ 24వ తేదీ కౌన్సిల్‌ ఆమోదం పొందిన స్థలాన్ని ఏ విధంగా రద్దు చేస్తారని యాదవ మహాసభ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముస్లిం శ్మశానవాటిక పరిస్థితీ అంతే...

ఒంగోలు నగరంలో ముస్లిం శ్మశాన వాటిక విషయంలో కూడా కూటమి ప్రజాప్రతినిధులు కుట్రలకు తెరతీశారు. కమ్మపాలెం దాటిన తర్వాత దశరాజుపల్లి రోడ్డులో గతంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2 ఎకరాల 40 సెంట్ల భూమిని ముస్లిం శ్మశాన వాటికకు కేటాయించింది. కమ్మపాలేనికి ఆనుకుని ఉందని ఆ సామాజిక వర్గం ప్రజలకు, ఆయన అనుయాయులకు ఆ స్థలాన్ని కట్టబెట్టాలని కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ స్థలాన్ని రద్దు చేసి ముక్తినూతలపాడు సర్వే నంబర్‌ 15లో 3 ఎకరాల భూమి కేటాయిస్తున్నామని దాటవేత ధోరణితో కాలయాపన చేస్తూ ముందుకుపోతున్నారు. ఆ స్థలం పూర్తిగా కుంట పోరంబోకు కావడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌ కళాక్షేత్రానికి అడ్డగోలుగా రూ.10 లక్షలు

ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్‌ కళాక్షేత్రానికి ప్రజల సొమ్ము అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. గత కౌన్సిల్‌ సమావేశంలో కళాక్షేత్రాన్ని టెండర్‌ ద్వారా ఒకరికి కేటాయించారు. అతనికి అప్పజెప్పిన నగర పాలక సంస్థ తిరిగి కళాక్షేత్రం పునరుద్ధరణ పనుల పేరిట రూ.10 లక్షలకు టెండర్‌ పిలిచింది. కౌన్సిల్‌ ఆమోదం తెలిపినప్పుడు పునరుద్ధరణ పనుల ప్రస్తావనే లేదు. అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్‌ పొందిన వ్యక్తి గతంలో కళాక్షేత్రాన్ని లీజుకు తీసుకుని రూ.25 లక్షలు ఒంగోలు నగర పాలక సంస్థకు పంగనామం కూడా పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement