
ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలి
● 5కే రన్‌ను ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు
ఒంగోలు టౌన్: ఎయిడ్స్ నియంత్రణపై యువత సరైన అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం నగరంలోని ప్రకాశం భవన్ నుంచి ప్రగతి నగర్ మీదుగా పాత రిమ్స్ వరకు నిర్వహించిన 5కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్, మాదక ద్రవ్యాల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎయిడ్స్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తపడాలని చెప్పారు. ఒకవేళ ఎవరికై నా ఎయిడ్స్ సోకినప్పటికీ ఆందోళన చెందకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని చెప్పారు. జిల్లా లెప్రసీ అధికారి శ్రీవాణి మాట్లాడుతూ ఎయిడ్స్, హెచ్‌ఐవీపై ఏవైనా సందేహాలుంటే 1097 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. జిల్లా స్పోర్ట్స్ అధికారి రాజరాజేశ్వరి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల బారిన పడకుండా చక్కటి ఆలోచనలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం హెచ్‌ఐవీ, ఎయిడ్స్, మాదక ద్రవ్యాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించారు. బాలుర విభాగంలో సంతోష్, ఎల్.నాని, బాలికల విభాగంలో ఐశ్వర్య, రమ్య జాయ్‌లకు ప్రథమ, ద్వితీయ బహుమతులుగా ఒక్కొక్కరికి రూ.10 వేలు, రూ.7 వేల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ పందింటి కిరణ్, సీఎస్‌ఓ సాయి, చంద్రమోహన్, గ్రో ఎన్జీఓ మేనేజర్ పీర్ బాషా, సినార్డ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ ప్రోగ్రామ్ జిల్లా వనరుల అధికారి జి.స్వరూప్ కుమార్, షేర్ ఇండియా పీఓ అమీన్, డాప్కూలేట్ రమేష్, పీపీఎన్ నెట్వర్స్ ప్రతినిధి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.