
ఆటల్లో అదరగొట్టు..!
గొట్లగట్టు..
కొనకనమిట్ల:
మండలంలోని గొట్లగట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారులకు, ఆటల పోటీల్లో పతకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆట ఏదైనా పాఠశాల క్రీడాకారులు సత్తాచాటుతూ పతకాలు సాధిస్తున్నారు. సుమారు 60 మంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. ఇటీవల నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన క్రీడా ప్రతిభా అవార్డుల ఎంపికలో జిల్లా స్థాయిలో గొట్లగట్టు జెడ్పీ పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది. చదువుతో పాటు క్రీడల్లోనూ పాఠశాల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. హెచ్‌ఎం, పీడీ, ఉపాధ్యాయులు క్రీడాకారులను గుర్తించి తగిన ప్రోత్సాహాన్ని వారికి అందిస్తుండటంతో ఏ పోటీలకు వెళ్లినా పతకంతో తిరిగి వస్తున్నారు. గతంలో ఈ హైస్కూల్లో పనిచేసిన పీడీ యరగొర్ల బాలగురవయ్య ఇచ్చిన శిక్షణతో కబడ్డీ, హ్యాండ్‌బాల్, రగ్బీ, రెజ్లింగ్, సెపక్‌తక్రా, అథ్లెటిక్స్ పోటీల్లో రాణిస్తూ ఎన్నో పతకాలు సాధించారు. ఆటల పోటీల్లో బాలురే కాదు.. బాలికలు సైతం సత్తాచాటుతూ తామేం తక్కువ కాదని నిరూపించారు.
నిరంతర సాధనతో
క్రీడా ప్రతిభా అవార్డుకు ఎంపిక...
గొట్లగట్టు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేసి ప్రస్తుతం మార్కాపురం మండలం పెదనాగులారం జెడ్పీ పాఠశాల పీడీగా పనిచేస్తున్న వై.బాలగురవయ్య ఒకప్పుడు ఈ పాఠశాల పూర్వ విద్యార్థే. పాఠశాలలో చదువుతున్న కొంతమంది క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ఆటల పోటీల్లో మెళకువలు నేర్పించారు. క్రీడలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి నిరంతరం సాధన చేయించారు. వారిలో పెండెం నరహరి, మొలకా చిరుత, దుర్బాకుల ఉమాశంకర్, వెన్నా విష్ణువర్దన్‌రెడ్డి, కోలా ఆకాష్, వరప్రసాద్, దుర్గాప్రసాద్, వెంకటయ్య, నవీన్, యువరాజు, దీప్తి, ఆర్.లక్ష్మీకల్పన, వి.మహేశ్వరి, చంద్రలిఖిత, గురులక్ష్మి, జస్సీలు పలు క్రీడా పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపికయ్యారు. అక్కడ కూడా సత్తాచాటి అవార్డులు, పతకాలు దక్కించుకున్నారు. గతేడాది ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలతో పాటు విజయవాడ, తెనాలి, ఒంగోలు, కమలాపురం, బాపట్ల, కావలి, ఏలూరులో నిర్వహించిన జాతీయ, రాష్ట్ర స్థాయి రెజ్లింగ్, కబడ్డీ, రగ్బీ, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు, బ్రాంజ్ మెడల్స్ సాధించారు..
సమన్వయం, సహకారంతోనే పతకాలు...
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రకటించిన క్రీడా ప్రతిభా అవార్డుల ఎంపికలో గొట్లగట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. ఇటీవల ఒంగోలులో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో హెచ్‌ఎం టి.ఆదినారాయణ, పాఠశాల పూర్వ పీడీ యరగొర్ల బాలగురవయ్యను జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు. డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ సోమా సుబ్బారావు, జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, జిల్లా క్రీడా సమైక్య కార్యదర్శి హజీరాబేగం చేతుల మీదుగా క్రీడా ప్రతిభా అవార్డు, ప్రశంస పత్రం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం ఆదినారాయణ మాట్లాడుతూ గొట్లగట్టు జెడ్పీ పాఠశాల క్రీడాకారులు ఆటల పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటడానికి అందరి సమన్వయం, సహకారం ఎంతో తోడ్పడ్డాయని తెలిపారు. అందువలనే తమ పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇటీవల బదిలీ అయిన పీడీ బాలగురవయ్య, హెచ్‌ఎం విజయలక్ష్మి సహకారం అభినందనీయమని అన్నారు.
క్రీడా ప్రతిభా అవార్డుల్లో గొట్లగట్టు జెడ్పీ హైస్కూల్‌కు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం
కబడ్డీ, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, రగ్బీ, సెపక్‌తక్రా, అథ్లెటిక్స్ పోటీల్లో రాణించిన విద్యార్థులు
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సుమారు 60 మంది క్రీడాకారులు

ఆటల్లో అదరగొట్టు..!