నయా భూ మాయ..! | - | Sakshi
Sakshi News home page

నయా భూ మాయ..!

Sep 14 2025 6:07 AM | Updated on Sep 14 2025 6:07 AM

నయా భూ మాయ..!

నయా భూ మాయ..!

కనిగిరి రెవెన్యూలో

కనిగిరి రూరల్‌:

నిగిరి రెవెన్యూ కార్యాలయంలో భూ మాయాజాలం జరుగుతోంది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే కొందరు వీఆర్వోలను ఇటీవల ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒకరిద్దరు రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ కూడా చేశారు. అయినా అధికార పార్టీ నేత అండతో ఇన్‌చార్జిగా వచ్చిన ఓ రెవెన్యూ కీలక అధికారి భూముల ఆన్‌లైన్‌ అక్రమాలకు తెరలేపి జోరుగా దోచుకుంటున్నాడు. రెవెన్యూ వ్యవస్థపై పట్టు, అవగాహన లేని ముదాంల నుంచి పదోన్నతిపై వీఆర్వోలుగా వచ్చిన వారిని మండలంలో చేర్చుకుని వారికి చిల్లర నజరానాలిస్తూ.. తాను భారీ మొత్తంలో దోచుకుంటూ రెవెన్యూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. నాన్‌ రిఫండబుల్‌ ఒప్పందంతో భూ వెబ్‌ల్యాండ్‌ పోర్ట్‌ల్‌లో ఆన్‌లైన్‌లో పేర్ల మార్పు, వారసత్వ ధృవీకరణ హక్కు పత్రాలు, పొజిషన్‌ సర్టిఫికెట్ల మంజూరు వంటి అనేక అక్రమాలకు పాల్పడి లక్షలు దోచుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి.

రాత్రికిరాత్రే ఆన్‌లైన్‌లో పేర్ల మార్పు...

కనిగిరి తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు అమ్యామ్యాలు తీసుకుని రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌లో భూ హక్కుదారుల పేర్లు మార్పుచేయడం, అవసరమైతే తొలగించి ఇతరుల కింద పెట్టడం, కొత్త పేర్లు ఎక్కించడం వంటి ప్రక్రియ జోరుగా సాగుతోంది. అందుకు భూమి విలువను బట్టి వీఆర్వోలు, అవసరమైతే నేరుగా కీలక రెవెన్యూ అధికారే డీల్‌ కుదుర్చుకుంటున్నాడు. అందిన సమాచారం మేరకు.. కనిగిరి మండలం చల్లగిరిగిల్ల రెవెన్యూ పరిధిలోని రెండు సర్వే నంబర్లకు సంబంధించి 20 ఎకరాల్లో సుమారు 15 మంది రైతులు సాగులో ఉన్నారు. ఆ రైతులు గతంలో ఆ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే, ఆ భూమిని సుమారు 25 ఏళ్ల క్రితం అమ్మిన వ్యక్తుల పేర్లు ఇంకా ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్నట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకుని చల్లగిరిగిల్ల రెవెన్యూ పరిధిలో టుబాకో బోర్డు వెనుక గల సుమారు 25 ఎకరాలు, 2 సర్వే నంబర్లకు చెందిన 9 ఎకరాలు, 16 ఎకరాల భూమిని ఐదుగురి పేర్లతో ఆన్‌లైన్‌ చేశారు. ఈ అక్రమ తంతులో సుమారు రూ.25 లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది.

గుప్పుమన్నదిలా...

సుమారు 20 రోజుల క్రితం జరిగిన ఈ అక్రమ ఆన్‌లైన్‌ తంతు విషయాన్ని నాలుగు రోజుల క్రితం రైతులు పసిగట్టారు. వెంటనే రెవెన్యూ కార్యాలయంలోని కీలక అధికారిని ప్రశ్నించారు. తగురీతిలో స్పందన లేకపోవడంతో గతంలో లోకేష్‌ టీంలో పనిచేసి ప్రస్తుతం సీఎంఓలో ఉంటూ ఓ ఎమ్మెల్యేకు పీఏగా వ్యవహరిస్తున్న కనిగిరి మండలానికి చెందిన వ్యక్తి నేరుగా కనిగిరి రెవెన్యూ కీలక అధికారికి ఫోన్‌ చేసి గట్టిగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో కంగుతిన్న ఆ కీలక అధికారి రాత్రికి రాత్రి తిరిగి వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఎక్కించిన పేర్లను తొలగించినట్లు సమాచారం. అంతేగాకుండా చల్లగిరిగిల్లకు చెందిన కొందరి వ్యక్తుల పేర్లను ఒక సర్వే నంబర్లో రాత్రికి రాత్రి ఎక్కించి, మరో నంబర్లో ఇంకొందరి పేర్లు ఎక్కించనున్నట్లు తెలిసింది. ఇవి కాకుండా ఇటీవల కలగట్ల రూట్‌లో ఓ యువ న్యాయవాదికి సంబంధించిన భూమిని కూడా మరొకరి పేరుపై ఆన్‌లైన్‌ చేసినట్లు, పేరంగుడిపల్లికి చెందిన ఓ కళాశాలకు చెందిన వ్యక్తి భూమిని మరొకరి పేరుపై ఆన్‌లైన్‌ చేసినట్లు, పునుగోడు రెవెన్యూ పరిధిలోని కొందరి భూములను అక్రమంగా మరికొందరి పేర్లపై ఆన్‌లైన్‌ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు బాధితులు నేరుగా రెండ్రోజుల క్రితం గత కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు, జేసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

నాన్‌రిఫండబుల్‌ ప్రక్రియపై పెద్ద ఎత్తున చర్చ...

భూముల రేటును బట్టి మాకు రేటు కడితే ఏమైనా చేస్తామని రెవెన్యూ కీలక అధికారి నేరుగా దందా చేస్తున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌ నమోదు, పేర్ల మార్పిడి, వారసత్వపు భూములు ఆన్‌లైన్‌ చేయడం.. ఇలా ఒక్కోదానికి ఒక్కోరేటు పెట్టినట్లు తెలిసింది. ఎక్కడైనా భూముల వివాదాలపై ఫిర్యాదులొస్తే అక్కడికి తన సిబ్బందిని పంపించడం, వివాదంలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంటే ఓ రేటు.. లేకపోతే మరో రేటు నిర్ణయించడం, కింది స్థాయి అధికారులతో బేరం సాగించడం చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల బల్లిపల్లిలో పంచాయతీలో ఓ రహదారి విషయం తమకు న్యాయం జరగడం లేదని బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక అధికారి నాన్‌రిఫండబుల్‌ విధానం పాటిస్తూ.. అందుకు ఇష్టపడిన వారితోనే దందా సాగించడం గమనార్హం. మీకు కావాల్సింది నేను చేస్తా.. అధికార పార్టీ నుంచి వత్తిడి వచ్చినా.. పైఅధికారులు విచారణ చేసినా.. ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే రద్దు చేస్తా.. ఆన్‌లైన్‌ నుంచి పేర్లు కూడా తొలగిస్తా.. అయితే, మీరు ఇచ్చిన నగదును రిటన్‌ చేయను.. దానికి ఇష్టపడితేనే పనిచేస్తా.. అంటూ ముందే ఒప్పందం కుదుర్చుకోవడంతో బాధితులు బయటకు చెప్పుకోలేని దుస్థితి నెలకొంది. ఈ నాన్‌రిఫండబుల్‌ ప్రక్రియపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

నాన్‌రిఫండబుల్‌ ఒప్పందంతో ఆన్‌లైన్‌ అక్రమాలు

చల్లగిరిగిల్లకు చెందిన 25 ఎకరాల భూమికి ఆన్‌లైన్‌లో పేర్ల మార్పు

లోకేష్‌ టీం వ్యక్తి ఫోన్‌తో తిరిగి పేర్ల తొలగింపు

రెవెన్యూ కీలక అధికారి అక్రమాలపై కలెక్టర్‌కు పలువురి ఫిర్యాదు

అధికారం అండతో ఇన్‌చార్జిగా కొనసాగుతున్న వైనం?

వీఆర్వోకు రూపాయి.. కీలక అధికారికి వంద..!

కనిగిరి మున్సిపాలిటీతో పాటు మండలంలోని 15 పంచాయతీలకు సుమారు 32 (అర్బన్‌ 12, రూరల్‌ 20) మంది వీఆర్వోలు ఉన్నారు. 16 మంది మాత్రమే వీఆర్వోలు ఉన్నారు. మిగతా రెవెన్యూ విలేజ్‌ అంతటికి ఇన్‌చార్జిలే. అందులో నేరుగా వీఆర్వోలుగా వచ్చిన వారు 5 లేదా 6 మంది మాత్రమే ఉండగా.. మిగతా వారంతా ముదాంలుగా ఉండి పదోన్నతులు పొందిన వారే కావడం విశేషం. వీరికి సరైన అవగాహన ఉండకపోవడంతో ప్రధాన రెవెన్యూ గ్రామాల్లో వీరిని ఇన్‌చార్జిలుగా పెట్టుకుని కీలక అధికారి కనుసన్నల్లో నడిపిస్తూ జోరుగా అక్రమ దందా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement