
పిడుగుపాటుకు 8 గొర్రెలు మృతి
పామూరు: పిడుగుపాటుకు 8 గొర్రెలు మృతిచెందిన సంఘటన పామూరు మండలంలోని రేణిమడుగు గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని కొనికి రత్తయ్యకు చెందిన గొర్రెలు దొడ్లో ఉండగా పిడుగు పడింది. దీంతో 8 గొర్రెలు మృతిచెందగా, రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని గొర్రెల యజమాని రత్తయ్య కోరారు.
ఒంగోలు, టాస్క్‌ఫోర్స్: నిన్నటిదాకా ఒక లెక్క.. నేడు మరో లెక్క అన్న సినిమా డైలాగులాగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల మత్స్యకారు లు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సోనాబోటుతో కడలూరు బోట్లను తరమికొట్టి విజయగర్వంతో తిరిగివచ్చారు. కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు ప్రాంతానికి చెందిన సోనాబోట్ల కారణంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయారు. కడలూరు బోట్ల కారణంగా లక్షలాది రూపాయల విలువ గల వలలు తెగిపోవటంతో పాటు సముద్రంలో మత్స్యసంపదనంతా నిబంధనలకు విరుద్ధంగా వేటాడుతూ దోచుకుపోతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు మత్య్సకారులే రంగంలోకి దిగారు. తమ సమస్యను తామే పరిష్కరించుకోవడానికి నడుం బిగించారు. ఆ ప్రకారం రెండు జిల్లాల్లోని మత్స్య కారులు మూడు రోజుల పాటు చేపల వేట నిషేధమని మత్స్యకారపాలెంలో దండోరా వేయించి చేపల వేటను బహిష్కరించారు. శుక్రవారం రాత్రి రెండు జిల్లాలకు చెందిన మత్స్యకారులు సుమా రు 80 మంది వరకు హైస్పీడ్ సోనాబోటులో కర్రలు, టపాసులు, ఇతర ఆయుధాలు సమకూర్చుకుని కడలూరు బోట్ల వేట మొదలుపెట్టారు. ఈలోగా సమాచారం అందుకున్న కడలూరు బోట్లు ఈ ప్రాంతంలో వేటాడకుండా కనిపించ నంతదూరం వెళ్లిపోయాయి. శుక్రవారం సాయంత్రం కూడా సింగరాయకొండ మండల పరిధిలోని తీరప్రాంతంలో సుమారు 6 సోనాబోట్లు తీరానికి దగ్గరగా చేపల వేట సాగించాయి. మత్స్యకారులు నెల్లూరు జిల్లా పరిధిలోని సోనా బోటు తీసుకుని బాపట్ల జిల్లా చీరాల మండలంలోని ఓడరేవు వరకు వెళ్లారు. కానీ, వారికి ఒక్క సోనాబోటు కూడా కనబడకుండా జారుకున్నా యి. గతంలో చిన్నబోటుతో చేపల వేటకు వెళితే సముద్రంలో 60 నుంచి 80 వరకు సోనాబోట్లు చేపలవేట సాగిస్తూ మత్స్యసంపద కొల్లగొట్టడంతో పాటు లక్షలాది రూపాయల విలువైన వలలు ధ్వంసం చేసేవని, దీంతో ఆర్థికంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఇవాళ వారిపై సమిష్టిగా దాడికి వెళితే ఒక్క బోటు కూడా లేదని, అన్నీ పరారయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. సముద్రంలో నిబంధన ల ప్రకారం కడలూరు బోట్లు చేపల వేట చేసేంత వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు.