
జిల్లా ప్రజల సహకారాన్ని మరచిపోలేను
ఒంగోలు టౌన్: జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది అందించిన సహకారాన్ని ఎన్నటికీ మరచిపోలేనని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. జిల్లాను వదిలివెళుతున్నప్పటికీ తన పరిధిలో సాయం అందించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన విజయనగరానికి వెళుతున్న సందర్భంగా ఆదివారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో కవాతు నిర్వహించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేరనియంత్రణ, గంజాయి నిర్మూలన, మహిళలు, బాలికలు, చిన్నారులపై నేరాలను అరికట్టడంలో సిబ్బంది కృషిని అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, రమణ కుమార్, కె.శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల సంఘ రాష్ట్ర కార్యదర్శి హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
పోలీసు కళ్యాణ మండపంలో...
పోలీసు శాఖపై ప్రజల నమ్మకం పెరిగేలా నిబద్దతగా పనిచేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. బదిలీపై విజయనగరం వెళుతున్న ఆయనను పోలీసు కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత 14 నెలల కాలంలో ప్రజలకు ఉత్తమ సేవలందించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చూపిన చొరవ అభినందనీయమన్నారు. జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, విద్యార్థులకు గంజాయి మీద అవగాహన కల్పించామన్నారు.