
సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధికి బాటలు
వీడ్కోలు సభలో కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు టౌన్: జిల్లా ఉన్నతాధికారులు, అన్నీ శాఖలకు చెందిన ఉద్యోగుల సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధికి బాటలు వేసేందుకు కృషి చేశానని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళుతున్న తమీమ్ అన్సారియాను జిల్లా అధికారులు ఆదివారం రిమ్స్ ఆడిటోరియంలో ఘనంగా సత్కరించారు. పలువురు అధికారులు కలెక్టర్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆయా సమస్యలపై వారికి అవగాహన కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే తన అభిమతమన్నారు. గత 14 నెలల కాలంలో ఇదే విధానాన్ని పాటించినట్లు చెప్పారు. గత ఏడాది జూన్ 27న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తాను జిల్లాలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించినట్లు తెలిపారు. స్పష్టమైన అవగాహనతోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేసినట్లు చెప్పారు. డ్వామా ఆధ్వర్యంలో నీటి సంరక్షణకు చేపట్టిన పనులకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమంలో జేసీ ఆర్.గోపాల కృష్ణ, డీఆర్‌ఓ చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్థన్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు మాట్లాడారు.