
నేర నియంత్రణలో రాజీపడేది లేదు
ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వి.హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: నేరాల నియంత్రణలో ఎలాంటి రాజీ పడేది లేదని, అసాంఘిక శక్తుల ఆటకట్టించి నేరరహిత జిల్లాగా మార్చేందుకు తనదైన శైలిలో పనిచేస్తానని ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు చెప్పారు. జిల్లా ప్రజలకు మరింతగా అందుబాటులో ఉంటానని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం నూతన ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అలాంటి వారిని ప్రోత్సహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రతలకు, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. శక్తి యాప్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తామని, యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆపద సమయాల్లో సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని చెప్పారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి కార్యాచరణ రూపొందించి నూతన ప్రణాళికలు అమలు పరుస్తామన్నారు. సిబ్బంది నుంచి అధికారుల వరకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తానని చెప్పారు. తొలుత స్వాతంత్య్ర యోధుడు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అధికారుల అభినందనలు:
సాధారణ బదిలీల్లో భాగంగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హర్షవర్థన్ రాజును జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, డీపీఓ ఉద్యోగులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. ఏఎస్పీ (అడ్మిన్) నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్ యశ్వంత్, వన్‌టౌన్ సీఐ నాగరాజు, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు తదితరులు ఎస్పీని కలిసి అభినందనలు తెలిపారు. డీపీఓ ఏవో రామ్మోహనరావు, డీసీఆర్బీ, డీటీసీ అధికారులు, సిబ్బంది ఎస్పీకి అభినందనలు తెలిపారు.