
ప్రైవేట్ పెత్తనం!
ప్రైవేటు సంస్థకు సీనరేజి వసూలు బాధ్యత ఈనెల 25న అప్పగించనున్న గనుల శాఖ అధికారులు నెలకు రూ.47.3 కోట్లు ప్రభుత్వానికి జమ చేయనున్న సంస్థ సొంత పొలంలో ఇసుక తవ్వినా పన్ను కట్టాల్సిందే.. గ్రానైట్, కంకర, మట్టి, గ్రావెల్ తరలించినా పన్ను వసూలు
సీనరేజ్‌పై
మీ సొంత స్థలం నుంచి.. ఇంటి అవసరాల కోసం మట్టి, ఇసుక తరలిస్తున్నా సరే ఇకపై పన్ను వసూలు చేస్తారు. సీనరేజి వసూళ్ల బాధ్యతను ప్రైవేటుకు కట్టబెట్టడంతో వసూళ్ల పర్వం ఇష్టారాజ్యంగా సాగనుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండేళ్ల పరిమితికి రూ.1136 కోట్లకు ఏఎంఆర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇకపై ఆ సంస్థే సీనరేజి వసూలు చేసి ప్రభుత్వానికి కట్టనుంది. ఈ ప్రైవేటు సైన్యం పెత్తనంతో గ్రానైట్ క్వారీల యజమానులు, ఫ్యాక్టరీల యజమానులు, కంకర మిల్లుల నిర్వాహకులతో పాటు సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు ఏజెన్సీ ద్వారా వసూలు చేయడం వలన గ్రానైట్ క్వారీల యజమానులు, ఫ్యాక్టరీల యజమానులు, కంకర మిల్లుల నిర్వాహకులకు అదనపు ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వం రాయల్టీ ప్రకారం సీనరేజీ వసూళ్లలో ఎంతోకొంత సానుభూతి ఉంటుంది. దాని వలన గ్రానైట్ రాళ్లల్లో రాయల్టీ వసూళ్లలో ఉదార స్వభావం ఉంటుంది. అదే ప్రైవేటు ఏజెన్సీలకి ఇస్తే రాళ్ల స్లాబులు, కంకర, చివరకు మట్టి మీద కూడా రాయల్టీ సీనరేజీ వసూలు చేయడంలో ఏజెన్సీ నిర్వాహకులు ముక్కుపిండి వసూలు చేస్తారని గ్రానైట్ తయారు గ్రానైట్ పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వసూళ్లు చేసిన సీనరేజీ నిధులను ప్రభుత్వానికి జమ చేసే లోపే నిధుల దుర్వినియోగం కూడా జరిగే అవకాశం ఉంది.
– ఆర్ లక్ష్మీనారాయణ, వీటీసీ కేంద్రం అధ్యక్షుడు, రామతీర్థం
ఒంగోలు సిటీ:
చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటి. సంపద సృష్టిస్తాం అంటూ ఏదో రకంగా ప్రజలపై భారం మోపుతోంది. సొంత పొలంలో ఇంటి అవసరాల నిమిత్తం మట్టి, కంకర వంటివి తరలించినా పన్నులు చెల్లించాల్సిందే. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటి వరకూ మైన్స్ అధికారులు గ్రానైట్, ఇతర క్వారీల నుంచి నెలకు సుమారు రూ.36 కోట్లు వసూలు చేస్తున్నారు. తాజాగా టెండరు దక్కించుకున్న సంస్థ రూ.47.3 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.
రెండేళ్ల పరిమితికి రూ.1136 కోట్లు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఇతర క్వారీల నుంచి సీనరేజ్ వసూలు చేసి రెండేళ్లలో ప్రభుత్వానికి రూ.1136 కోట్లు చెల్లించేలా ఏఎంఆర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ లెక్కన సదరు సంస్థ నెలకు రూ.47.3 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇంటి అవసరాలకు, క్వారీల్లో చిన్న తవ్వకాలు చేసినా ముక్కుపిండి సీనరేజ్ వసూలు చేస్తారు. సదరు సంస్థ మైన్స్ అధికారులు వసూలు చేస్తున్న రూ.36 కోట్లు కంటే అదనంగా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు వసూలు చేసేలా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ మైన్స్ అధికారులు సంవత్సరానికి రూ.435 కోట్లు వసూలు చేస్తున్నారు. తాజాగా ప్రైవేటు సంస్థ దాదాపు రూ.600 కోట్ల వరకూ వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు, క్వారీ నిర్వాహకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి సీనరేజ్ వసూలు చేసే బాధ్యతను టెండరు దక్కించుకున్న సంస్థకు అప్పగించనున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 600 వరకూ గ్రానైట్ క్వారీలతో పాటు చిన్నా, పెద్దా కంకర, గ్రావెల్ క్వారీలు ఉన్నాయి. క్వారీ నుంచి రాళ్లు, గ్రావెల్ వంటివి బయటకు తరలించాలంటే నిబంధనల ప్రకారం సీనరేజీ చెల్లించాలి. ప్రస్తుతం గనులశాఖ అధికారుల స్థానంలో ప్రైవేటు సిబ్బంది ఈ బాధ్యతలు చేపడతారు. ఇప్పటి వరకూ మైన్స్ అధికారులు గ్రానైట్ క్వారీలో ముడిరాయి క్యూబిక్ మీటరుకు రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం టెండరు దక్కించుకున్న సంస్థ కొలత ప్రకారం ఎంత ముడిసరుకు బయటకు వెళ్లిందో లెక్కించి అందుకనుగుణంగా పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఈ నెల కొంతే పన్నులు వసూలయ్యాయని తప్పించుకోకుండా చెల్లించాల్సిందే. సీనరేజీ అంచనా వేసిన మేరకు విభాగాల వారీగా ఆయా ప్రభుత్వ ఖాతాలకు నెల వారీ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. గ్రానైట్, కంకర తదితరాల మాదిరే గ్రామాల్లో మట్టి, గ్రావెల్ వంటివి తరలించినా పన్ను రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. జిల్లాలో నిత్యం సుమారు 2 వేల నుంచి 3 వేల వరకు చిన్న పెద్ద భవన నిర్మాణాలు జరుగుతుంటాయి. వీటికి భారీగా మట్టి, గ్రావెల్ అవసరం ఉంటుంది. గ్రావెల్, మట్టిలకు సంబంధించి సీనరేజీలను ప్రైవేటు వ్యక్తులు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు చేపట్టే నిర్మాణాలపై భారం పడనుంది.