
బెడిసికొట్టిన భూకబ్జా ప్లాన్
ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల జేసీబీతో చదును చేస్తున్న అక్రమార్కులు
సింగరాయకొండ:
జాతీయ రహదారి పక్కనే సుమారు కోటిన్నర రూపాయల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించేందుకు టీడీపీ నేతలు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. ఆక్రమణదారులకు ఆది నుంచే సంపూర్ణ సహకారం అందించిన రెవెన్యూ అధికారులు.. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్లేటు ఫిరాయించి అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టారు. అందిన సమాచారం మేరకు ఈ భూ కబ్జా బాగోతం వివరాలిలా ఉన్నాయి.
సింగరాయకొండ మండలంలోని కనుమళ్ల పంచాయతీ చిన్న కనుమళ్ల ఎస్సీ కాలనీ సమీపంలో ఊళ్లపాలెం–వేములపాడు జాతీయ రహదారి పక్కనే సర్వే నంబర్ 70లో సుమారు 0.77 ఎకరాలు చెరువు పోరంబోకు స్థలం ఉంది. ఇది కనుమళ్ల చెరువుకు వర్షం నీరు ప్రవహించే ఒరవ. గత ఆదివారం ఈ స్థలాన్ని టీడీపీ సానుభూతిపరుడు, మండల రెవెన్యూ కార్యాలయంలో చక్రం తిప్పే ప్రైవేట్ వ్యక్తితోపాటు మరికొందరు కలిసి జేసీబీతో చదును చేశారు. స్థలంలో తొలగించిన చిల్లచెట్లు, తాటిచెట్లను తగలబెట్టారు. దీంతో చినకనుమళ్ల గ్రామస్తులు కొందరు స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని వీఆర్వో విజయ దృష్టికి తీసుకెళ్లారు. ఆ స్థలాన్ని గతంలో కంకణాల ఆనంద్ అనే వ్యక్తికి అసైన్‌మెంట్ కింద పట్టా ఇచ్చినట్లు రికార్డు ఉందని, అతని వారసులు బాగు చేసుకుంటున్నారని వీఆర్వో సమాధానం ఇవ్వడంతో కనుమళ్ల వాసులు అవాక్కయ్యారు. ‘అది చెరువు పోరంబోకు స్థలం. ఒకవేళ ఆనంద్‌కు పట్టా ఇస్తే అతను చాలా కాలం క్రితమే చనిపోయారు. అతనికి వారసులు ఎవరూ లేరు. స్థలాన్ని బాగు చేస్తోంది ఆనంద్ మరదలు తాలూకు వ్యక్తులు. వారు ఆనంద్‌కు వారసులు ఎలా అవుతార’ని స్థానికులు నిలదీశారు.
వీఆర్వో తీరుపై అనుమానాలు
కనుమళ్ల రెవెన్యూ సర్వే నంబర్ 70లో సెంటు స్థలం సుమారు రూ.2 లక్షలు ఉంది. దీంతో ఈ స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క రంగంలోకి దిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు పోరంబోకు స్థలంలో అసైన్‌మెంట్ పట్టా ఇచ్చారని వీఆర్‌ఓ చెప్పడం స్థానికంగా చర్చనీయాంశం కావడంతో ఆక్రమణదారులతోపాటు రెవెన్యూ అధికారులు సైతం వెనకడుగు వేయక తప్పలేదు. దీనిపై డిప్యూటీ తహసీల్దార్ తానికొండ ప్రసాద్‌ను వివరణ కోరగా.. సర్వే నంబర్ 70లో ఉన్నది ప్రభుత్వ భూమి. అందులో ఎవరికి పట్టా ఇవ్వలేదు. గురువారం ఒక వ్యక్తి రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఎన్నో ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటున్నాం, హక్కు కల్పించాలని కోరాడు. పట్టా లేదని చెప్పడంతో హక్కు కల్పించడానికి వీలుపడదని తెలియజేశామ’ని వివరించారు.
హైవే పక్కన చిన్న కనుమళ్ల సర్వే నం.70లో విలువైన ప్రభుత్వ భూమి

బెడిసికొట్టిన భూకబ్జా ప్లాన్