పొగాకు వేలం అడ్డగింత
టంగుటూరు: ‘లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు. మీడియం రకం పొగాకుకు రోజు రోజుకు ధరలు తగ్గిస్తున్నారు. పెరిగిన పెట్టుబడులకు మీరు ఇస్తున్న ధరలకు ఏమాత్రం పొంతనం ఉండటం లేదు. ధరలు తగ్గించుకుంటూ పోతే మేం ఎలా బతకాలంటూ’ పొగాకు రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. టంగుటూరు వేలం కేంద్రం పరిధిలో మంగళవారం పొందూరు, ఆలకూరపాడు గ్రామాల రైతులు పొగాకు బేళ్లను వేలానికి తీసుకువచ్చారు. అయితే వేలం ప్రారంభం తరువాత ధరలను చూసిన రైతులు ఆగ్రహంతో వేలాన్ని అడ్డుకున్నారు. మీడియం రకం పొగాకుకు కేవలం రూ.205 వేయడాన్ని రైతులు మండిపడ్డారు. గత ఏడాది ఇదే రకం పొగాకును రూ.360లకు కొనుగోలు చేశారని, ఇప్పుడు ఇంత తక్కువ ధరలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఆర్‌ఎం లక్ష్మణరావు కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. అరగంట పాటు రైతు నాయకులు, రైతులతో చర్చల అనంతరం వేలాన్ని కొనసాగించారు. రైతులు వేలానికి 447 బేళ్లను తీసుకురాగా 362 బేళ్లను కొనుగోలుచేసి 85 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.205, సరాసరి ధర రూ.241.20గా నమోదైంది. వేలంలో 23 కంపెనీలు పాల్గొన్నాయి.
లో గ్రేడ్ కొనుగోలు చేయడం లేదని రైతుల ఆగ్రహం రోజు రోజుకూ ధరలు పతనమవుతున్నాయని మండిపాటు కంపెనీ ప్రతినిధులతో చర్చల అనంతరం తిరిగి ప్రారంభం


