
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి పేర్నినాని. ఏపీలో పోలీసు వ్యవస్థ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. బాబు రావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా?. టీడీపీ నేతల దోపిడీని అడ్డుకోవడమే నాగ మల్లేశ్వర రావు చేసిన నేరమా?. ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు.. ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ర్టంలో నరరూప రాక్షసులు రాజ్యం ఏలుతున్నారు. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా ఉండాల్సిన ఖాకీలు సైలెంట్ అయిపోయాయి. ఒక ముఖ్యమంత్రి గా అందరికీ న్యాయం చేయాల్సిన చంద్రబాబు వైఎస్సార్‌సీపీ వారికి ఏ పనీ చేయొద్దంటున్నారు. దైవ సాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఇలా చేయటం సబబేనా?. వైఎస్సార్‌సీపీ వారిపై దాడులు చేయండి, పోలీసులు అండగా ఉంటారని చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కనుసన్నల్లోనే మల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగింది. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబమే ఇరవై ఏళ్లుగా ఆ గ్రామంలో సర్పంచ్‌గా ఉంటున్నారు. మరి ఎమ్మెల్యే చెప్పినట్టు ఆ కుటుంబమంతా రాక్షసులైతే జనం ఇన్నేళ్లుగా ఎలా గెలిపిస్తున్నారు?. ఎమ్మెల్యే మనుషులే నాగమల్లేశ్వర రావుపై హత్యాయత్నం చేశారు. బాబూరావు అనే ఎమ్మెల్యే మనిషితో గొడవల వలనే నాగ మల్లేశ్వరరావుపై దాడి చేశారని అంటున్నారు. నిజానికి బాబూరావుపై గతంలో దాడి జరుగుతుంటే ఆపిందే నాగ మల్లేశ్వరరావు. అలాంటి వ్యక్తిని ఈరోజు చంపేందుకు ప్రయత్నించారు
మన్నవ గ్రామంలో వైఎస్సార్‌సీపీదే హవా. దాన్ని చూసి తట్టుకోలేక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ఊర్లో గొడవలు పెడుతున్నారు. ఆ పక్కనే ఉన్న వెల్లలూరు గ్రామంలో ఆరు హత్యలకు కారకులెవరో అందరికీ తెలుసు. ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చేయాలని ధూళిపాళ్ళ కోరుకుంటున్నారు?. రప్పా రప్పా అని పోస్టర్ పట్టుకున్నోడిపై కేసులు పెట్టినవాళ్లు మరి నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నంపై ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఆడపిల్లలు కనపడకపోతే పోలీసులు పట్టించుకోవడం లేదు.
పవన్ కళ్యాణ్ చెబితేనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. మరి ఆయన దగ్గరకు వెళ్దామంటే సినిమా షూటింగ్ బిజీలో ఎక్కడో ఉంటారు . చంద్రబాబుకు ఇబ్బంది కలిగినప్పుడు ఒక తమ్ముడు, చెల్లెలు కలుగులో నుండి వస్తారు. మిగతా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగినా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ. చంద్రబాబుకు అద్దెకు ఇవ్వటానికే పవన్ పార్టీ పెట్టారు.
వైఎస్ జగన్‌ని అధికారంలోకి రానీయను అనటానికి పవన్ ఎవరు?. 2019లో కూడా జగన్‌ని అధికారంలోకి రానీయనని పవన్ అన్నారు. మరి ఏమైంది?. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది జనమే తప్ప పవన్ కాదు. సుగాలీ ప్రీతి అదృశ్యం కేసును పవన్ రాజకీయాలకు వాడుకుని ఇప్పుడు వదిలేశారు. కనీసం కార్యకర్తలను కూడా పవన్ పట్టించుకోవడం లేదు. హెలికాఫ్టర్‌లో పిల్లల్ని తీసుకుని తిరగటం తప్ప పవన్‌కి ఇంకేం తెలుసు?. కనీసం తన సొంత శాఖలో ఏం జరుగుతుందో కూడా పవన్‌కి తెలియదు.
పంచాయతీలకు రావాల్సిన రూ.2,800 కోట్లను ప్రభుత్వం పక్క దారి పట్టిస్తే పవన్ ఎందుకు నోరు మెదపటం లేదు?. రేషన్ బియ్యం షిప్పుల కొద్దీ బయటకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. తిరుమలలో రోజూ అపచారాలు జరుగుతుంటే పవన్ పోరాటం ఎందుకు చేయటం లేదు?. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించటం లేదు?. హెలికాఫ్టర్‌లో ప్రకాశం జిల్లాకు వెళ్లిన పవన్‌కి కరేడులో రైతుల సమస్యలు కనపడటం లేదా?. మీ ప్రభుత్వం 8 వేల ఎకరాలను మీ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుంటే ఏం చేస్తున్నారు?.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల విధానాలు బాగ లేవంటూనే వాటిని ఎందుకు అమలు చేస్తున్నారు?. చంద్రబాబు, లోకేష్ లకు సిగ్గు లేదా?. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులను మంత్రి వచ్చే వరకు సైకోగాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
