
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును పవన్ రాజకీయంగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేస్తే అది కూడా పవన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘జనసేనకు ఐడియాలజీ అనేది ఉందా?. జనసేన ఐడియాలజీ అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిమా!. జనసేన సిద్ధాంతం అర్థం కాక ఆ పార్టీ నేతలే సతమతమవుతున్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ న్యాయం చేశారు. పవన్ ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును రాజకీయంగా వాడుకున్నారు. చంద్రబాబు హయాంలోనే సుగాలి ప్రీతి నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేశారు.
ప్రీతి తల్లిదండ్రులకు వైఎస్ జగన్ భూమి, ఇల్లు, ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి పవన్ కేకలు వేస్తూ మాట్లాడారు. ప్రీతి కేసును సీబీఐని అప్పగించాలని పవన్ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే నిందితులు అరెస్ట్ అయ్యి బెయిల్‌పై బయటకు వచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబానికి పవన్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. పవన్ తీరుతో ప్రీతి కుటుంబం మానసికంగా కుంగిపోయింది. నిందితులకు డీఎన్‌ఏ మ్యాచ్ కాకపోవడంతో చంద్రబాబు హయంలోనే నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలిప్రీతి హత్య విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది చంద్రబాబును.. కానీ, ఆయనను ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదు’ అంటూ విమర్శలు చేశారు.

స్టీల్ ప్లాంట్ అంశంపై పవన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. త్వరలో మరో రెండు వేల మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు. కూటమి వేధింపులు తాళలేక 1440 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. వీఆర్‌ఎస్ తీసుకోవడానికి మరో 1000 మంది ఉద్యోగులు రెడీ ఉన్నారు’ అని తెలిపారు.