సాక్షి, తాడేపల్లి: విద్యాశాఖను భ్రష్టు పట్టించడానికే నారా లోకేష్.. విద్యాశాఖను వాడుకుంటున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటలు కోటలు దాటుతున్నాయి.. లోకేష్ విద్యాశాఖను తప్పితే అన్ని శాఖలను పట్టించుకుంటారు’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘ఎస్‌ఈఆర్‌టీ కన్వీనర్, డీఎస్సీ కన్వీనర్ ఒక్కరే!. పరీక్ష పేపర్ తయారీ హెడ్, పరీక్ష నిర్వహించే హెడ్ ఒక్కరే. డీఎస్సీలో పారదర్శకతకు నారా లోకేష్ పాతరేశారు. ఎస్‌ఈఆర్‌టీ ఉన్న వ్యక్తులే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అత్యంత గోప్యంగా జరగాల్సిన వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో డీఎస్సీ ప్రశ్నపత్రం అప్‌లోడ్ చేయించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కి టాప్ ర్యాంక్ వచ్చింది. నవీన్‌ని టాపర్‌గా ప్రకటించి మళ్ళీ లిస్ట్‌లో మార్పులు చేశారు. నవీన్‌ని ఎందుకు తీసేసారో సమాధానం చెప్పాలి’ అని పేర్ని నాని నిలదీశారు.
‘‘పేపర్ లీక్ అయ్యిందని ఒప్పుకున్నట్టే కదా?. లీకేజీని కప్పి పెట్టడానికే నవీన్ పేరు తొలగించారు. బరితెగించి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీ, టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ ముందురోజు 4, 47 జీవోలను తెచ్చారు. అర్హత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తే పిల్లలు భవిష్యత్ ఏమవ్వాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చిన టీచర్లతో లోకేష్ కొడుక్కి పాఠాలు చెప్పించగలరా..?. నారా లోకేష్‌కి దమ్ముంటే దేవాన్స్‌కి ఈ టీచర్లతో పాఠాలు చెప్పించాలని ఛాలెంజ్ చేస్తున్నా. డీఎస్సీ అయిపోగానే మళ్ళీ జీవో మార్చేశారు. ఇక మీదట స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాస్తేనే ఉద్యోగం ఇస్తాం అని మార్చారు. డీఎస్సీలో అక్రమాలకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.?
‘‘ఐఏఎస్ అధికారులు కొందరు సిగ్గులేకుండా తప్పులు చేసినోళ్లకు వంత పాడుతున్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ అనేది పేకాట కాదా..?. జోకర్ లేకుండా ఆడే పేకాట బ్రిడ్జ్ కాదా..?. దానికి ఉద్యోగం ఇస్తామన్నది వాస్తవం కాదా?. ఆ విమర్శ చేశానని నా మీద కేసు పెడతారా..?. కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజులు వస్తాయి. పోస్టులు అమ్ముకుంటు బేరాల వీడియోలు బయటకొచ్చినా సమగ్ర విచారణ జరపలేదు. డీఎస్సీలో అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం. జిల్లా కలెక్టర్ల కు 31 న వినతిపత్రాలు ఇస్తాం. వచ్చే నెల 6 నుండి 9 వరకు 4 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్షలు చేస్తాం. ఆగస్టు 10 అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని కోరతాం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.


