ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ: సుదర్శన్‌రెడ్డి | YSRCP Legal Cell Jalla Sudarshan Reddy Comments On TDP Conspiracies Over Tiruvuru Municipal Elections, News Video Inside | Sakshi
Sakshi News home page

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ: సుదర్శన్‌రెడ్డి

May 20 2025 1:10 PM | Updated on May 20 2025 3:01 PM

Ysrcp Legal Cell Jalla Sudarshan Reddy Comments On Tdp Conspiracies

సాక్షి, తాడేపల్లి: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్‌తో పాటు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయలేదని ఆ పార్టీ లీగల్ సెల్ సీనియర్ నాయకుడు జల్లా సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్లను ఎన్నిక జరిగే ప్రాంతానికి వెళ్లనివ్వకుండా మార్గమధ్యలోనే కూటమి పార్టీలకు చెందిన గుండాలు అడ్డుకుని దౌర్జన్యం చేశారని అన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన పోలీసులు కూటమి నేతలకు అండగా నిలబడి, వైఎస్సార్‌సీపీ నేతలనే అరెస్ట్ చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఖూనీ అవుతోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...

తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం విజయవాడ నుంచి తరలివెళుతున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై మరోసారి కూటమి పార్టీలకు చెందిన గుండాలు దౌర్జన్యం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది. నిన్న కౌన్సిలర్లు ఎన్నికకు హాజరుకాకుండా కూటమి పార్టీలకు చెందిన వారు ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో అందరూ చూశారు. దీనితో ఈ రోజుకు ఎన్నికను వాయిదా వేశారు. ఏ విధంగా అయినా సరే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఈ రోజు కూడా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు హాజరుకాకుండా అడ్డుకోవడాలని, తమకున్న కొద్దిపాటి సభ్యుల నుంచే చైర్మన్‌ను ఎన్నుకోవాలని కూటమి పార్టీలు కుట్ర పన్నాయి.

దీనిని అర్థం చేసుకున్న వైఎస్సార్‌సీపీ నిన్ననే ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఎన్నికకు హాజరయ్యేందుకు రక్షణ కల్పించాలని కోరిన మీదట, ఎన్నికల కమిషన్ డీజీపీతో పాటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలంటూ  మెమో కూడా జారీ చేసింది. దీనిలో భాగంగానే వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు ఎక్కడి నుంచి ఏ మార్గంలో తిరువూరు మున్సిపల్ కార్యాలయం వరకు వెడతారో పూర్తి వివరాలను సంబంధిత పోలీస్ అధికారులకు అందచేశాం.

రక్షణ కల్పించాల్సిన పోలీసులే దౌర్జన్యానికి కొమ్ముకాశారు
నిన్న కూటమి పార్టీలు చేసిన దౌర్జన్యానికి భయపడి పలువురు కౌన్సిలర్లు విజయవాడ రామవరప్పాడులోని ఒక హోటల్‌లో తలదాచుకున్నారు. నిన్న టీడీపీ నేతలు కిడ్నాప్‌కు ప్రయత్నించడంతో మరో మహిళా కౌన్సిలర్ తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఇంట్లో ఆశ్రయం పొందారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి భద్రత ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఈ మొత్తం అంశంపై కోర్ట్‌లో హౌస్ మోషన్ కింద పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. రాత్రి ఫైల్ చేసిన పిటీషన్‌ను ఈ రోజు పదిగంటలకు కోర్ట్‌ విచారణకు స్వీకరించింది. ఈ సందర్బంగా కోర్ట్ ఎదుట ప్రభుత్వం తరుఫు న్యాయవాది మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు పూర్తి రక్షణ కల్పించడం జరిగిందని చెప్పారు. అయితే ఏ అధికారి పర్యవేక్షణలో రక్షణ కల్పించారు. 

హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోని పచ్చ ఖాకీలు

ఎక్కడి నుంచి ఎక్కడకు రక్షణ కల్పించారని, ఒక ఏసీపీ స్థాయి అధికారిని నియమించి, ఆయన ద్వారా కోర్టుకు నివేదిక సమర్పించాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కోర్టులో ఈ అంశం విచారణలో ఉందని తెలిసి కూడా ఏ కొండూరు మండలం పడమట మాధవరం గ్రామం వద్ద కూటమి పార్టీలకు చెందిన వారు వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లను అడ్డుకున్నారు. కూటమి నేతల దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, నాయకుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్‌లను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో భయాందోళనలకు గురైన వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు ఎన్నిక జరిగే ప్రదేశంకు వెళ్ళకుండానే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెనుదిరిగారు.

వీరు సమావేశంకు వెడితే కూటమి పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఓడిపోతారు. అందుకే రెండోసారి కూడా ఎన్నిక జరగకుండా అధికారబలాన్ని ఉపయోగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. చట్టంలోని లొసుగును అడ్డం పెట్టుకుని మూడోసారి కోరం లేకపోయినా ఎన్నిక జరపవచ్చని చూపుతూ వారికి ఉన్న తక్కువ మంది కౌన్సిలర్ల నుంచే చైర్మన్‌ను ఎన్నుకోవాలన్నదే వారి లక్ష్యం. ఇలాంటి చర్యలను చూస్తే ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉందా అనే సందేహం కలుగుతోంది. న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగానే పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడం చూస్తూంటే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఖూనీ అయ్యిందని  అర్థమవుతోంది. ఈ జరిగిన మొత్తం వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోతున్నాం. దీనికి బాధ్యులైన అధికారులపై న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement