
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తన సోదరితో రాఖీ కట్టే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. కోర్టు డైరెక్షన్లను కూడా జైలు అధికారులు అమలు చేయడం లేదన్నారు. మిథున్‌రెడ్డికి సరైన సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన సోదరి శక్తి రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ మార్గాని భరత్ కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు తీసుకు వెళుతున్న రాఖీలను జైలు అధికారులు వాటిని వెనక్కి పంపించారు. దీంతో, రాఖీలు లేకుండానే ఆమె ములాఖత్‌కు వెళ్లారు.
అనంతరం, ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ..‘ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. చేదు అనుభవాలతో జైలులోకి వెళ్లాల్సి వచ్చింది. రక్షాబంధన్ రోజున సోదరితో రాఖీ కట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్‌ను సైతం జైలు అధికారులు అమలు చేయడం లేదు. కేవలం ప్రతిపక్ష నేతలు ములాఖత్‌కు వెళితే జైలు ఎదుట ఇంత భారీ భద్రత అవసరమా?. అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం. కేబినేట్ అనుమతులు లేకుండా జీవోలు జారీ చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వమే. 2014-19 మధ్యలో వేల కొద్దీ బెల్డ్ షాపులు ఏర్పాటు చేశారు. పాదయాత్రలో మహిళలు కోరిన మీదట 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మద్యం నియంత్రణ చేసే కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గకుండా, విచ్చలవిడిగా మద్యం చలామణి కాకుండా వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది అంటూ మండిపడ్డారు.


మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ మాట్లాడుతూ..‘కనీసం పోలీసుల సమక్షంలోనైనా రాఖీ కట్టడానికి మిథున్ రెడ్డి సోదరికి అవకాశం ఇవ్వకపోవడం దారుణం. కూటమిలో మిగిలిన పార్టీలకు వాయిస్ లేదు.. కూటమి అంటే కేవలం టీడీపీ మాత్రమే. ఏపీలో మద్యం పాలసీ దారుణంగా ఉంది. మందుబాబులు రోడ్లపైనే తాగేస్తున్నారు. ప్రతి మద్యం షాప్‌నకు అనధికార పర్మిట్ రూమ్ ఉంది. టీడీపీ నేతలు బందిపోటు ముఠాలా మారి ప్రజలపై రాబందుల్లా పడ్డారు. మద్యం పాలసీ రూపొందించిన తరువాత కమీషన్లు ఎలా పెంచారు. పెరిగిన కమీషన్లు కరకట్ట ప్యాలెస్‌కి వెళ్లాలా?. ఇది కదా స్కామ్ అంటే. డిస్టలరీలకు ప్రివిలైజ్ ఫీజు మీరు ఎందుకు మాఫీ చేశారు. రాష్ట్ర ప్రజలకు 3000 కోట్లు ఎందుకు నష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో 60 వేలకు తగ్గకుండా బెల్ట్ షాపులు ఉన్నాయి. 2019-24 వరకూ రాష్ట్రంలో ఒక్క బెల్ట్ అయినా ఉందా?. ఆలస్యమైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది’ అని అన్నారు.