
పశ్చిమ గోదావరి జిల్లా: చంద్రబాబు ఎప్పుడు గెలిచినా ప్రజలను మోసం చేసే మాత్రమే గెలిచాడని వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్‌రాజు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి కూటమి పెద్దలు మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించిందని, తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను ఎప్పుడూ మోసం చేయలేదన్నారు ప్రసాద్‌రాజు.
తాడేపల్లిగూడెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు, కన్వీనర్ గూడూరు ఉమాబాల, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్ర నాథ్ తదితరులు హాజరయ్యారు.
దీనిలో భాగంగా ప్రసాద్‌రాజు మాట్లాడుతూ.. ‘పార్టీని మనం ఎలా బలోపేతం చేసుకోవాలి.. ప్రజల సమస్యల కోసం ఎలా పోరాడాలి అనేవి రెండు మన ప్రధాన అంశాలు. గత 5 ఏళ్ళు ప్రజలకోసం మాత్రమే ఆలోచించి కార్యకర్తలను పక్కన పెట్టిన సంగతి నిజమే. కానీ ఇకనుంచి కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై ఇప్పటివరకూ 4,500 కేసులు పెట్టారు. వైఎస్ జగన్ బయటకి వెళ్లడానికి అనేక ఆంక్షలు పెడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో దారుణమైన సంస్కృతికి తెరలేపారు.
ఏడాది కాలంలో ‘కూటమి’ చేసేందేమీ లేదు
ఏడాది కాలం అయినా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు విమర్శించారు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన తప్ప ఏమీ జరగట్లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, మహిళలకు నెలకు రూ 1500, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు 50ఏళ్లకే పెన్షన్ లాంటి అనేక హామీలలో ఏ ఒక్కటి నెరవేరలేదు.ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారని నిలదీయాల్సిన అవసరం ఉంది.
దాని ద్వారా ప్రజాలకు మంచి జరిగే అవకాశం ఉంది. ప్రజలు గ్రహించారు వైఎస్ జగన్ మాత్రమే ఇచ్చిన హామీలను నెరవేర్చగలడని. ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు. వచ్చేది మన ప్రభుత్వం. ఏ కార్యకర్త భయపడాల్సిన పనిలేదు. లోకేష్ గత ప్రభుత్వంలో తిరిగితే భద్రత ఇచ్చిన సంగతి మరచిపోయారా. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం’ అని స్పష్టం చేశారు.