పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తారా?: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తారా?: వైఎస్‌ జగన్‌

Jun 27 2026 8:52 PM | Updated on Jun 27 2026 9:13 PM

YSRCP Chief YS Jagan Slams Chandrababu Govt

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. రాజధాని బాధిత రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిస్తే దాడులు చేయిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ.. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?, లేక గూండాల రాజ్యాన్ని నడుపుతున్నారా? అంటూ ధ్వజమెత్తారు. రాజధాని రైతుల ఆహ్వానం మేరకు  సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న  వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? అంటూ ‘ఎక్స్‌’లో ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నించారు వైఎస్‌ జగన్‌.

ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? 
‘పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా?, రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా?, ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్‌ చేయడం అత్యంత దారుణం. అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా?’ అని ప్రశ్నించారు.

రైతుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా?
‘భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్‌ ప్లాట్లకింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం… ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా? అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా?’ అని నిలదీశారు.

ప్రజలు మిమ్మల్ని క్షమించరు. 
‘చంద్రబాబుగారు.. ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయస్సార్‌సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయస్సార్‌సీపీ వారికి తోడుగా నిలుస్తుంది’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement