ఈ స్కామ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హస్తం
నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలి
అవకతవకలను సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతూ ‘ఎక్స్’లో మాజీ సీఎం వైఎస్ జగన్ పోస్టు
పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకతను తుంగలో తొక్కారు
ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ ఒక్కరికే అప్పగించడం కుట్రలో తొలి అడుగు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాలు అప్‌లోడ్ చేసే బాధ్యత
అదే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రావడం పేపర్ లీక్ కుంభకోణానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా?
మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?
మెరిట్ జాబితా నుండి అతడి ఐడీ, డేటాను రాత్రికి రాత్రే ఎందుకు తొలగించారు?
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అతడిని ఎందుకు పిలవలేదు?.. ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించడానికి ఇవి కారణాలు కాదా?
మార్కులు, కటాఫ్, స్పోర్ట్స్, అన్ని రిజర్వేషన్లు పరిగణనలోకి తీసుకున్నాకే 1ః1 నిష్పత్తిలో కాల్ లెటర్స్
అయినప్పటికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన పలువురి పేర్లు తుది జాబితా నుంచి మాయం
కొత్త జీవోలు తెచ్చి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ రాత పరీక్ష నుంచి మినహాయింపు
దొడ్డి దారిన నియామకాలు పూర్తి కాగానే ఆ జీవోలు రద్దు చేయడం స్కామ్ కాదా?
అసలు సూత్రధారుల ముసుగు తొలగాలంటే సీబీఐ విచారించాలని వెల్లువెత్తుతున్న డిమాండ్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 మోసం, దగా, స్కామ్ డీఎస్సీగా మారిందంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈనెల 11న ఆయన మీడియా సమావేశం ద్వారా సాక్ష్యాధారాలతో సహా ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా స్కామ్ జరిగిన తీరుకు ఆధారాలు జత చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శనివారం పోస్టు చేశారు. ఈ మెగా స్కామ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హస్తం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన మెగా డీఎస్సీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతుండటాన్ని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రస్తావించారు. లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్ చెలగాటమాడిన తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ చేసిన పోస్టు సంచలనం రేపింది. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే..
ప్రతిభావంతుల జీవితాలతో చెలగాటం
‘మెగా డీఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తూ, అత్యంత చాకచక్యంగా మెగా స్కామ్‌కు తెర తీసి.. చీకటి దందాకు పాల్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ అవకతవకలు, మోసాల వల్ల నేడు లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతటి దారుణమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదు. 16,000 డీఎస్సీ పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకతను పూర్తిగా తుంగలో తొక్కారు. డీఎస్సీ నియామకాలను డబ్బులు గుంజే కుంభకోణంగా మార్చాలన్న దుర్బుద్ధితో అత్యంత పకడ్బందీగా, సంస్థాగతంగా తనిఖీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంతటి దారుణమైన అక్రమాలు, అవతవకలు చోటుచేసుకున్న నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ జరగలేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక డీఎస్సీ. నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యా శాఖ నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి అత్యంత తీవ్రంగా ఖండించదగినవి. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక పర్వాలు (మల్టీ లేయర్)గా సాగిన ఈ మెగా స్కామ్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
వ్యవస్థల ధ్వంసం.. కుట్రకు తొలి అడుగు!
డీఎస్సీ నిర్వహణలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. పరీక్షల గోప్యతను కాపాడటం కోసం గతంలో ప్రశ్నపత్రాల తయారీని ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కి, పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్‌కు వేర్వేరుగా అప్పగించేవారు. కానీ.. ఈ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేస్తూ డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనబెట్టారు. ఈ రెండు కీలక బాధ్యతలను ఒకే వ్యక్తికి.. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కే కట్టబెట్టారు. తద్వారా పారదర్శకతను ఉద్దేశ పూర్వకంగా దెబ్బతీసి, అక్రమాలకు దారి సుగమం చేస్తూ ఈ మెగా స్కామ్‌కు తొలి అడుగు వేశారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యతలు.. పేపర్ లీక్
పరిస్థితిని మరింత దిగజారుస్తూ, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఒకవేళ వ్యవహారం బయటపడితే వారిని బలిపశువులను చేయవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఈ అక్రమాలకు పరాకాష్టగా ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే బాధ్యతలో భాగస్వామిగా ఉన్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగే ఈ డీఎస్సీ పరీక్షలో ఏకంగా మొదటి ర్యాంక్ సాధించడం గమనార్హం. ఇది పేపర్ లీక్ కుంభకోణానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు వ్యవస్థ ఎంత బలహీన పడిందో స్పష్టం చేస్తున్నాయి. మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? మెరిట్ జాబితా నుండి అతడి ఐడీ, డేటాను ఎందుకు రాత్రికి రాత్రే తొలగించారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అతడిని ఎందుకు పిలవలేదు? ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించడానికి ఇవే కారణాలు కాదా? ఎస్‌సీఈఆర్‌టీలో ఉంటూ ప్రశ్నపత్రాలను అప్‌లోడ్ చేసే ప్రక్రియలో పాలుపంచుకున్న వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, పేపర్ లీక్ లోతును వెలికి తీయాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం.
ఫలితాల ప్రకటనలో లోపించిన పారదర్శకత
డీఎస్సీ ఫలితాల ప్రకటనలో పారదర్శకత పూర్తిగా మృగ్యమైంది. గతంలో మెరిట్, రోస్టర్ జాబితాలను కలెక్టరేట్ నోటీస్ బోర్డులపై ఉంచే సంప్రదాయం ఉండేది. దాన్ని పక్కనబెట్టి, కేవలం ఆన్‌లైన్ డిస్‌ప్లే, మొబైల్ మెసేజ్‌లకే పరిమితం చేస్తూ కేంద్రీకరించారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్ర అనిశ్చితికి లోనై, తమ ఫిర్యాదులు చెప్పుకోవడానికి కలెక్టరేట్ల చుట్టూ, హెడ్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చింది. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. 1ః1 నిష్పత్తిలో కాల్ లెటర్లు అందుకుని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న పలువురు అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితా నుంచి మాయమయ్యాయి. ‘స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ రూల్స్ 2025’ లోని రూల్ 20ని కచ్చితంగా పాటిస్తే.. మార్కులు, కటాఫ్, స్పోర్ట్స్, వికలాంగుల కోటా వంటి అన్ని హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నాక, వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికీ తుది జాబితాలో చోటు దక్కాలి. కానీ, అర్హులైన ఎంతో మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది.
సీబీఐ దర్యాప్తే శరణ్యం
లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను, కలలను కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా సమాధి చేసింది. ఈ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న పెద్దల హస్తం ఉంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వారి పరిధిలోనే పనిచేస్తాయి కాబట్టి, వారు నిజాలు నిగ్గు తేల్చలేరు. అందుకే, బాధితులకు న్యాయం జరగాలన్నా, ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలన్నా స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతోనే సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటా మళ్లింపు.. దొడ్డిదారి నియామకాలకు బ్లూప్రింట్!
ఈ కుంభకోణంలో అత్యంత వివాదాస్పదమైనది స్పోర్ట్స్ కోటా వ్యవహారమే. నియామక ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుగా జీవోలను మార్చేసిన తీరు క్రీడాలోకాన్ని విస్మయానికి గురి చేసింది. 2012 నాటి జీవో నంబర్ 74 ప్రకారం క్రీడాకారులు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలనే నిబంధన ఉండేది. కానీ, చంద్రబాబు, లోకేశ్ ద్వయం ఈ నిబంధనను తొలగిస్తూ 2024 డిసెంబర్‌లో కొత్తగా జీవో నంబర్ 8, జీవో నంబర్ 4, 47లను తీసుకొచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ రాత పరీక్ష నుంచే మినహాయింపు ఇచ్చారు. అంటే, తమకు కావాల్సిన వారిని దొడ్డిదారిలో (బ్యాక్ డోర్ ఎంట్రీ) చొప్పించడానికి ముందే ఒక పక్కా బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు.
తీరా అనుకున్న విధంగా రాత పరీక్ష లేకుండా నియామకాలు పూర్తి కాగానే.. మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరిస్తూ జీవో నంబర్ 23, 25, 56లను జారీ చేశారు. క్రీడాకారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఇబ్బందులు ఎదురయ్యాయని సాకులు చెబుతూ.. పని పూర్తయ్యాక దొడ్డి దారిని మూసి వేయడం వీరి కపట నీతికి అద్దం పడుతోంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ‘ఉపాధ్యాయ పోస్టు బేరసారాల’ వీడియోపై అధికారులు నామమాత్రంగా స్పందించారు. నిందితుడి ఫోన్ నంబర్ స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎఫ్‌ఐఆర్‌లో పేరు కూడా చేర్చకుండా, కేవలం స్టేషన్ బెయిల్‌పై వదిలేయడం వెనుక ఉన్న హస్తమెవరిదో అర్థమవుతూనే ఉంది.


