రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Speech At Juvvaladinne | Sakshi
Sakshi News home page

రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్‌ జగన్‌

Apr 15 2026 12:02 PM | Updated on Apr 15 2026 2:58 PM

YS Jagan Speech At Juvvaladinne

సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ మరో ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఫిషింగ్‌ హార్బర్‌ను పరిశీలించి.. స్థానిక మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘మా ప్రభుత్వ(వైఎస్సార్‌సీపీ) హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టాం. పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేశాం. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం. మారిటైం బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం. 

2024 మార్చి 12న జువ్వలదిన్నెను వర్చువల్‌గా ప్రారంభించాం. 1,250 మెకనైజ్డ్‌ బోట్లు అందించాలనుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవే. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35 శాతం పూర్తి చేశాం. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఏపీ ఎకనామిక్‌ గ్రోత్‌కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశాం.  

మరి మిగిలిన పనులను కూటమి సర్కార్‌ ఎందుకు పూర్తి చేయడం లేదు?. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది.  ఈ ప్రాజెక్టు పూర్తై రెండేళ్లు గడుస్తోంది. దీనిని ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నరకు పైనే అవుతోంది. అయినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదు? అని చం‍ద్రబాబు సర్కార్‌ను వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

మత్స్యకారుల నుంచి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు. మత్స్యకారులకు  మేలు చేయకపోగా.. పొట్టపై తంతున్నారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేందుకు కుట్రలు జరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్చి 12న మంత్రి  నారా లోకేష్‌ జువ్వలదిన్నెను సందర్శిస్తే.. 16న సీజ్‌ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారు. బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్ట్‌ చేశారా?. అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేసి తీసుకెళ్లారు కాబ్టి ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. సీజ్‌ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.. మత్స్యకారుల కడుపు కొట్టేందుకు ఇంత మంది ఏకమవుతున్నారు.  బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయి.   

ఏ ప్రైవేట్ కంపెనీకి ఇస్తావా ఇచ్చుకో... మా ప్రభుత్వం వచ్చాక మాత్రం

కళ్లుమూసి తెరిచే లోపే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ప్రైవేట్‌ డిఫెన్స్‌ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం. జువ్వలదిన్నె మాత్రమే కాదు మొత్తం పది ఫిషింగ్‌ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఫిషింగ్‌ హార్బర్లు మత్స్యకారుల హక్కు. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడు’’  అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement