
ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ భవిష్యత్‌పై ఎలా ఉండబోతుందన్నది అంతుబట్టడం లేదు.
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే, బీజేపీతో చేతులు కలిపి పంతం నెగ్గించుకున్నారు. బాల్ ఠాక్రే రాజకీయ వారసుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి భంగపడ్డారు. ఇప్పుడు ఆయనకు మరో సవాల్ ఎదురుకానుంది. తన తండ్రి స్థాపించిన పార్టీలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారా, లేదా అనేది మరాఠా రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
శివసేన పార్టీకి చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది ఏక్‌నాథ్ షిండేతో జట్టు కట్టారు. చట్టబద్దంగా శివసేన పార్టీ తమకే చెందుతుందని ఆయన వాదిస్తున్నారు. బాల్ ఠాక్రే కుమారుడిగా ఉద్ధవ్ ఠాక్రేను తామంతా గౌరవిస్తామని ఆయన అంటున్నారు. వెంటనే పార్టీ పగ్గాలు ఉద్ధవ్ ఠాక్రే నుంచి లాగేసుకుంటారా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు. అటు బీజేపీ కూడా తమ కంటే తక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు కలిగిన ఏక్‌నాథ్ షిండేకు సీఎం పీఠాన్ని కట్టబట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ భవిష్యత్‌పై ఎలా ఉండబోతుందన్నది అంతుబట్టడం లేదు.
చేతులారా చేసుకున్నారా?
ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుత పరిస్థితికి ఆయన నిర్ణయాలే కారణమని షిండే వర్గం ఆరోపిస్తోంది. సుదీర్ఘ కాలం మిత్రపక్షంగా ఉన్న బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టడమే ఉద్ధవ్ రాజకీయ పతనానికి నాంది పలికిందని అంటున్నారు. తాము తిరుగుబాటు చేసినప్పుడైనా ఆ రెండు పార్టీలతో తెగతెంపులు చేసుకునివుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని పేర్కొంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోవడంతో పాటు పార్టీ పగ్గాలు కూడా కోల్పోయే ప్రమాదం దాపురించిందన్నారు. అయితే రెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీపై పట్టు సాధించడానికి ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి వ్యూహాలు అవలంభిస్తారో చూడాలి. (క్లిక్: శివసేనకు వెన్నుపోటు పొడిచి మొత్తం ఆయనే చేశారు!)