చతుర్ముఖ పోరులో... పంజాబ్‌ షేర్‌ ఎవరో?

who is the share of Punjab Election 2022 - Sakshi

తాజా రాజకీయ ‘చిత్రం’

వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ తర్వాత అత్యంత కీలక రాష్ట్రం పంజాబ్‌. ఎందుకంటే మిగతా మూడు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ చిన్న రాష్ట్రాలు. సాగు చట్టాలకు వ్యతిరేక ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పంజాబ్‌ రైతులు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఎవరి పక్షాన నిలుస్తారు... అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పంజాబ్‌ రాజకీయం బాగా వేడెక్కింది. శిరోమణి అకాలీదళ్, ఆమ్‌ ఆద్మీ పార్టీలైతే ఏడాదికాలంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.

దీనికి తోడు ఇటీవల స్వర్ణదేవాలయం, కపుర్తలాలలో సిక్కుల మతచిహ్నాలను అపవిత్రం చేసే ప్రయత్నాలు జరగడం, లుథియానా కోర్టులో పేలుడు వెనుక ఖలిస్థాన్‌ గ్రూపుల హస్తమున్నట్లు వార్తలు రావడంతో... రాజకీయాలకు మతం రంగు పులిమేందుకు, ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ) పేరిట కొత్త పార్టీని పెట్టి బీజేపీతో జట్టు కట్టడంతో పంజాబ్‌ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారాయి. రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తాజా పరిస్థితిపై విశ్లేషణ...

దళిత ఓటుపై గంపెడాశలు
పదేళ్లు అధికారంలో ఉండి... తీవ్రమైన అవినీతి ఆరోపణలు, రాష్ట్రం డ్రగ్స్‌ ఊబిలో కూరుకుపోవడంతో 2017లో శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. కేవలం 15 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. పంజాబ్‌ రైతాంగంలో రగులుతున్న అసంతృప్తిని పసిగట్టిన అకాలీదళ్‌ 2020లో మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంది. పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ సతీమణి హర్‌సిమ్రత్‌ కౌర్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అకాలీదళ్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తోంది. రాష్ట్ర జనాభాలో 32 శాతం దళితులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ)తో ఈ ఏడాది జూన్‌లోనే పొత్తు పెట్టుకుంది. 20 సీట్లకు బీఎస్‌పీకి వదిలిపెట్టింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 111 స్థానాల్లో బరిలోకి దిగిన బీఎస్‌పీ 110 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోగొట్టుకుంది.

1.59 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అయితే అంతకుముందు 2007లో 4.17 శాతం, 2012లో 4.3 శాతం ఓట్లను బీఎస్‌పీ పొందింది. దళితులపై పట్టున్న డేరాల ప్రభావం తగ్గడం, డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌రహీమ్‌ సింగ్‌ జైలుకెళ్లడంతో... దళితల ఓట్లను కూడగట్టడంతో మాయావతి తొడ్పడగలరని అకాలీదళ్‌ అంచనా. అయితే సొంత రాష్ట్రం యూపీలో కూడా ఎన్నికలున్న నేపథ్యంలో పంజాబ్‌ ప్రచారానికి మాయావతి ఎంత సమయాన్ని కేటాయించగలరనేది ప్రశ్న. మరోవైపు సుఖ్‌బీర్‌ చాలా ముందునుంచే 2022లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికి 91 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. 21 కొత్త ముఖాలను దింపారు. ముందే ఖరారు కావడంతో నియోజకవర్గంలో స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి, తగినంత సమయం వెచ్చించడానికి అకాలీదళ్‌ అభ్యర్థులకు వీలు చిక్కింది.

కొత్త పొత్తు...
కాంగ్రెస్‌ పొమ్మనకుండా పొగబెట్టడం తో పాటియాలా రాజు.. అమరీందర్‌ ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ పేరిట సొంతకుంపటి పెట్టుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో కలిసి బరిలోకి దిగుతానని ప్రకటించిన కెప్టెన్‌ అన్నట్లుగానే పొత్తును ఖరారు చేసుకున్నారు. ఎవరెన్ని సీట్లలో పోటీచేయాలనేది ఇంకా తేల్చుకోలేదు. అకాలీ చీలికవర్గ నేతలను కూడా కూటమిలో చేర్చుకుంటామని కెప్టెన్‌ ఇదివరకే స్పష్టం చేశారు. అకాలీదళ్‌తో పొత్తులో భాగం గా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం మూడు స్థానాల్లో నెగ్గింది. 5.39 శాతం ఓట్లను సాధించింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పోటీచేసిన మూడింటిలో రెండు నెగ్గి...9.63 శాతం ఓట్లు పొందింది. అమరీందర్‌ కాంగ్రెస్‌ ఓట్లను ఎన్నింటిని చీల్చగలరు, సాగు చట్టాల రద్దు ఈ కూటమికి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది,  మోదీ కరిష్మా రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లను రాల్చ గలదు... ఇవన్నింటిపై ఈ కూటమి ఎన్ని చోట్ల గెలుస్తుందనేది ఆధారపడి ఉంటుంది.

సొంతగూటిని చక్కదిద్దాలి..
ఒత్తిడికి తలొగ్గి అనుభవజ్ఞుడైన ముఖ్య మంత్రి అమరీందర్‌ సింగ్‌ను మార్చడం, తర్వాత అదేపనిగా పీసీసీ అధ్యక్షుడు నవ జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌కు సొంత గూటిని సరిదిద్దుకోవడానికే ఎక్కువ సమయం సరిపోతోంది. పీసీసీ అధ్యక్షుడే సొంత ప్రభుత్వంపై బౌన్సర్లు సంధిస్తుంటే... తలబొప్పి కట్టడం ఖాయం. ప్రస్తుతం సిద్ధూతో కాంగ్రెస్‌ పెద్దలు ఇదే అవస్థను ఎదుర్కొంటున్నారు. పంజాబ్‌ జనాభాలో దాదాపు 32 శాతం దళిత ఓట్లు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... ఆ వర్గానికి చెందిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది కాంగ్రెస్‌.

ఎన్నికల్లో దళిత కార్డుగా ఉపయోగించుకోవడానికే చన్నీని అందలం ఎక్కించారని.. ఆర్నెళ్ల సీఎంగా మిగిలిపోతారని... కాంగ్రెస్‌కు దమ్ముంటే 2022 ఎన్నికల్లో కూడా ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ హస్తం పార్టీ అలా చేయలేదు. సర్వం తన కనుసన్నల్లో నడవాలనుకునే సిద్ధూకు కోపం తెప్పించే సాహసం కాంగ్రెస్‌ చేయలేదు. అలాగని ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్తే... దళిత ఓటు పోటును ఎదుర్కోవాల్సిన సంకట స్థితి. సిద్ధూ మాటల మాంత్రికుడు. చక్కటి హావభావాలతో సూటిగా ప్రజల మనసుల్లో ముద్రవేయగల వాగ్భాణాలను సంధిస్తారు. పంజాబ్‌ లో కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిన అమరీందర్‌ లేని లోటును సిద్ధూ ఏమేరకు పూడ్చగలరు, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి తన చరిష్మాతో మళ్లీ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఖాతాలో వేయగలరా? వేచి చూడాలి.

కేజ్రీవాల్‌పైనే భారం
ఢిల్లీకే పరిమితమైన ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌పై బాగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బల మైన పునాది కలిగిన అకాలీదళ్‌కు వెనక్కి నెట్టి... 20 స్థానాలతో ఆప్‌ పంజాబ్‌ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 23.72 శాతం ఓట్లు రావడంతో గత ఐదేళ్లుగా ప్రణాళిక ప్రకారం పంజాబ్‌లో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీకి ఆరుస్థానాలను (రెండు నెగ్గింది) వదిలిన ఆప్‌ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. పూర్తిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజాకర్షణపైనే ఆధారపడుతోంది. ఢిల్లీలో పాఠశాలల్లో నాణ్యత మెరుగుపడటం, మొహల్లా క్లినిక్‌లు విజయవంతం కావడం, పేదలకు ఉచిత విద్యుత్‌... తదితర ఢిల్లీ మోడల్‌ పాలనను అందిస్తామని వాగ్ధానం చేస్తోంది. సిక్కునే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 73 మంది అభ్యర్థుల పేర్లను ఆప్‌ ప్రకటించింది.


 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top