వరుణ్‌కు కాంగ్రెస్‌ ‘ఆఫర్‌’? బీజేపీకి గట్టిపోరు? | What Is Varun Gandhi's Next Move After Ticket Denial? | Sakshi
Sakshi News home page

Varun Gandhi: వరుణ్‌కు కాంగ్రెస్‌ ‘ఆఫర్‌’? బీజేపీకి గట్టిపోరు?

Mar 27 2024 8:18 AM | Updated on Mar 27 2024 8:56 AM

What is Varun Gandhis Next Move After Ticket Cut - Sakshi

గాంధీ కుటుంబంలో దశాబ్దాల నాటి రాజకీయ శత్రుత్వం ముగియనుందా? రాహుల్, వరుణ్ కలిసి నడుస్తారా? వరుణ్‌గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చినప్పటి నుంచి ఈ ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. రాబోయే లోక్‌సభ ఎ‍న్నికల నేపధ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వరుణ్ గాంధీపైనే నిలిచింది. యూపీలోని పిలిభిత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీకి బీజేపీ టిక్కెట్‌ కేటాయించకపోవడంతో ఈ చర్చ మరింత వేడందుకుంది. 

పిలిభిత్‌ సీటు గాంధీ కుటుంబీకుల సంప్రదాయ సీటు. వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ ఈ స్థానం నుండి ఆరు సార్లు, వరుణ్ గాంధీ ఈ స్థానం నుండి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి పిలిభిత్ టికెట్ ఇవ్వలేదు. జతిన్ ప్రసాద్‌ను ఇక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ వరుణ్‌కు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది. దీంతో ఇప్పుడు వరుణ్ గాంధీ తదుపరి స్టెప్ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. 

ఒకవేళ వరుణ్‌గాంధీ కాంగ్రెస్‌ ఆఫర్‌ను అంగీకరిస్తే గాంధీ కుటుంబం మధ్య  కొనసాగుతున్న రాజకీయ శత్రుత్వానికి తెరపడుతుందని  రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అప్పుడు అన్నదమ్ములైన రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ మరోసారి రాజకీయంగా ఏకమవుతారని అంటున్నారు.  ఇటీవల కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వరుణ్ గాంధీని కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. వరుణ్ గాంధీ చాలా కాలంగా సొంత పార్టీని పలు అంశాలలో విమర్శిస్తూ వస్తున్నారు. వరుణ్‌ వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అగ్నివీర్ యోజన, కేంద్ర ఉచిత రేషన్ స్కీమ్ మొదలైనవాటిపై వరుణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ వరుణ్‌కు టిక్కెట్‌ కేటాయించలేని తెలుస్తోంది. అయితే అతని తల్లి మేనకాగాంధీకి మాత్రం బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో వరుణ్ కాంగ్రెస్‌ ఆఫర్‌ను అందుకుంటారా? సోదరుడు రాహుల్‌తో కలిసి ముందుకు అడుగులు వేస్తారా? అనేది త్వరలో తేలిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement