కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ తన మ్యానిఫెస్టో విడుదల చేసింది. దీదీకే వచన్ పేరుతో ప్రజలకు పది హామీలను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. దీదీకే వచన్ దువారో చికిత్స ( ప్రజలకు ఇంటి వద్దకే వైద్యసేవలు) నిరుద్యోగులకు ప్రతినెల రూ.1,500, మహిళలకు ప్రతినెల రూ. 1,500,ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 1,700 అందజేయనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు మరిన్ని సంక్షేమ ఫలితాలను ప్రకటించింది. బెంగాల్‌లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి.
కాగా ఇటీవలే ఐదు రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌తో పాటు తమిళనాడు,కేరళ, అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి.మెుత్తంగా ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతుండగా 17.4 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఎలక్షన్ కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. సీఎం మమతా బెనర్జీ పేచీలో ఉన్న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీని తొలగించి వారి స్థానంలో ఇతర అధికారులను నియమించింది.
అయితే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సారి 226 కు పైగా స్థానాల్లో విజయం సాధించి వరుసగా నాలుగవ సారి అధికారం ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించింది. ఈ ఏడాది భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపింది. దీంతో బీజేపీ సైతం మమత పోటీ చేస్తున్న స్థానంలో తమ అభ్యర్థిగా సువేందు అధికారిని నిలపనుంది.
2021లో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది. దీంతో భవానీపూర్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. 2021లో టీఎంసీ 213 స్థానాలు గెలుచుకొని హ్యాట్రిక్ విజయం సాధించింది. 2016లో మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ 2021లో 77 స్థానాలు చేజిక్కించుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో ఈ ఏడాది పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.


