పవన్‌పై కోపం చల్లారట్లేదా? | Vijay fans upset as Pawan cutout remarks spark social media storm | Sakshi
Sakshi News home page

పవన్‌పై కోపం ఎంతకీ చల్లారట్లేదా?

May 28 2026 11:35 AM | Updated on May 28 2026 12:34 PM

Vijay fans upset as Pawan cutout remarks spark social media storm

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇటీవల రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తమిళనాడు–ఆంధ్రప్రదేశ్‌ ఫ్యాన్‌ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ రాజకీయాల్లో సినిమా హీరోల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన నేపథ్యంలో.. ఆ చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత సినీ–రాజకీయ విమర్శలుగా మొదలైన రియాక్షన్‌లు ఇప్పుడు సెటైర్‌ వార్‌ను దాటి మరింత భావోద్వేగ దశకు చేరుకున్నాయి.

మొదట సోషల్‌ మీడియాలో ఆగ్రహంగా మొదలైన ప్రతిస్పందనలు ఇప్పుడు క్రమంగా విభిన్న రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెటైర్లతో బదులిచ్చిన నెటిజన్లు, ఇప్పుడు తమ అభిమాన హీరో వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మరింత గట్టిగా స్పందిస్తున్నారు.

పవన్‌ ప్రసంగంలో “కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా గెలిచేసి సీఎంలు అయ్యారు” అనే వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో, కొందరు అభిమానులు దాన్ని తమ హీరోలపై వ్యాఖ్యలుగా భావించారు. దీంతో తమిళనాడు సోషల్‌ మీడియా వేదికలపై “పవన్ సార్… మా దళపతి మీలా కాదు” అనే వాక్యం విస్తృతంగా ట్రెండ్‌ అవుతోంది. ఇది నేరుగా విజయ్ అభిమానుల భావోద్వేగ కౌంటర్‌గా మారింది.

విజయ్ అభిమానులు ఈ కౌంటర్ ద్వారా ఆయన 25 ఏళ్ల సినీ ప్రస్థానం మాత్రమే కాదు, ప్రజలతో ఏర్పరుచుకున్న అనుబంధాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. “కేవలం హైప్‌ వల్ల కాదు… నిజమైన ఫ్యాన్ బేస్‌, గ్రౌండ్‌ లెవెల్‌ కనెక్షన్ వల్లే ఆయన నిలిచారు” అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేయడం, ఫ్యాన్స్‌ అసోసియేషన్ల ద్వారా విద్యా సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాగే తమిళనాడులో వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో ఆయన ప్రకటించిన విరాళాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న విధానాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.

“సినిమాల్లో మాత్రమే హీరో కాదు… అవసరమైన సమయంలో ప్రజలతో నిలబడే వ్యక్తి” అంటూ కొందరు విజయ్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యక్తిత్వం, అభిమానులతో మెలిగే తీరు, పబ్లిక్‌లో చూపించే సింప్లిసిటీని ఉదాహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ కేవలం సినిమా లేదా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ఇద్దరు నటుల వ్యక్తిత్వాల పోలిక దాకా వెళ్లిన పరిస్థితి వెళ్లింది.

మరోవైపు పవన్‌ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు కాదని, రాజకీయ అనుభవాలపై చేసిన సరదా వ్యాఖ్యలేనని వారు చెబుతున్నారు. 15 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను హైలైట్ చేయడమే ఉద్దేశమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్‌ కంటే పవనే తోపు అంటూ విజయ్‌ అభిమానులతో వాదనకు దిగుతున్నారు. దీంతో.. పవన్‌ వ్యాఖ్యలపై విజయ్‌ అభిమానుల కోపం ఇంకా చల్లారడం లేదు. 

మొత్తానికి పవన్‌ వ్యాఖ్యలు ఒక సాధారణ రాజకీయ హాస్యంగా మొదలై, ఇప్పుడు తమిళనాడు–ఆంధ్రప్రదేశ్‌ ఫ్యాన్ వర్గాల మధ్య భావోద్వేగ పోరుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement