
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు.. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని వైఎస్ జగన్ ఊహించారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి?’’ అంటూ విడుదల రజిని ప్రశ్నించారు.
శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేశారని.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అంటూ నిలదీశారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేటుపరం అవుతోంది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం. ఈ స్కాం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తాం’’ అని విడదల రజిని పేర్కొన్నారు.
‘‘ఆరోగ్యశ్రీని దివంగత మహానేత వైఎస్సార్ తీసుకు వచ్చారు. కొన్ని లక్షలమందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది. వైఎస్సార్, జగన్ పేరును ప్రజల్లో లేకుండా చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను 120 సంవత్సరాలు బతికిస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారు. ముందుగా తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపండి. మాటలు ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలి’’ అంటూ విడదల రజిని డిమాండ్ చేశారు.