దేవుళ్ల ఆస్తులు కాపాడలేని చైర్మన్లు ఎందుకు?

Vellampalli Srinivas And Botsa Satyanarayana On Bobbili dynasty - Sakshi

అన్యాక్రాంతమవుతుంటే ఏం చేస్తున్నారు?

ఆభరణాలను మీ ఇళ్లల్లో ఉంచడమేమిటి? 

బొబ్బిలి రాజవంశీకులపై మంత్రులు వెలంపల్లి, బొత్స ప్రశ్నల వర్షం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బొబ్బిలి, విజయనగరం రాజుల ఆధీనంలోని దేవస్థానాలకు చెందిన భూములు అన్యాక్రాంతమవుతుంటే ఆ దేవాలయాల చైర్మన్లుగా ఉండి ఏం చేస్తున్నారు?  చైర్మన్‌ను అని అనుకోవడం కాదు. భూముల్లో ఒక గజం స్థలం కూడా కాపాడలేకపోతే... దేవదాయ శాఖ చూస్తూ ఊరుకోవాలా? అలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా జోక్యం చేసుకుంటుంద’ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.శనివారం జరిగిన విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులిద్దరూ పాల్గొన్నారు.

అనంతరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్ట్, బొబ్బిలి వేణుగోపాల స్వామి దేవాలయాల భూములపై లోతుగా పరిశీలిస్తే వేల ఎకరాల భూమి రికార్డుల్లో లేదని, దశల వారీగా అమ్ముకున్నట్లు దేవదాయశాఖ అధికారుల దర్యాప్తులో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల సింహాచలం దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీ నాయకుడు ఆర్‌వీఎస్‌కే రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు బొబ్బిలిలోని భూములను  కాపాడలేకపోయారని, ఆ పనిని ఇప్పుడు దేవదాయ శాఖ చేపడుతుందన్నారు. తప్పు జరిగిందని తేలితే చైర్మన్‌లైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆభరణాలను దేవాలయాల్లో ఉంచకుండా.. ఎవరి అనుమతితో తీసుకెళ్లి కోటలోని ఇంటిలో ఉంచారని ప్రశ్నించారు.  

‘మాన్సాస్‌’ పదవి హక్కును కోర్టు తేల్చాలి..  
విజయనగరంలోని మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పదవిపై హక్కు ఎవరిదో కోర్టు తేల్చాల్సి ఉందని మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పెద్దకొడుకు వారసురాలి హక్కుతో ట్రస్ట్‌ చైర్మన్‌ బాధ్యతలను సంచయిత గజపతిరాజు చేపట్టారని, దాన్ని సవాలు చేస్తూ అశోక్‌ గజపతిరాజు తెచ్చుకున్న కోర్టు తీర్పుతో ఆ పదవిని ఆమె కోల్పోయారని తెలిపారు. ఉన్నత న్యాయస్థానాలను ఆమె ఆశ్రయించారని, అలా వారసత్వపు అంశంపై అన్నదమ్ముల మధ్య వస్తున్న వివాదంతో ప్రభుత్వానికి సంబం«ధం లేదని స్పష్టం చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top