గింజ సన్నబియ్యం కొనలేదు.. పైసా ఖర్చు చేయలేదు: మంత్రి ఉత్తమ్‌ | Sakshi
Sakshi News home page

గింజ సన్నబియ్యం కొనలేదు.. పైసా ఖర్చు చేయలేదు: మంత్రి ఉత్తమ్‌

Published Mon, May 27 2024 5:02 AM

Uttamkumar Reddy Fires On BRS Govt

ఏ ప్రక్రియ ప్రారంభించకముందే స్కామ్‌ జరుగుతుందా? 

అర్థరహిత ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు 

కిలో సన్నబియ్యం రూ.42కు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది 

పౌరసరఫరాల సంస్థను అప్పుల ఊబిలో నెట్టింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే 

మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు గింజ సన్నబియ్యం కూడా కొనుగోలు చేయలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సన్నబియ్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పైసా ఖర్చు చేయలేదన్నారు. అలాంటప్పుడు కుంభకోణానికి ఆస్కారమే ఉండదని వివరించారు. ఈ అంశంపై ఏమాత్రం అవగాహన లేని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అర్థరహితంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం కొనుగోలులో ఏకంగా రూ.300 కోట్ల స్కామ్‌ జరిగిందని చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. 

ఆదివారం గాంధీభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏ.లక్ష్మణ్, సంజీవరెడ్డి, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.30 రూపాయలకు కిలో ఉన్న సన్నబియ్యాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని కేటీఆర్‌ మాట్లాడుతున్నాడని, సన్నబియ్యం రూ.42కు కిలో చొప్పున ఎంత స్టాక్‌ ఉన్నా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆమేరకు సమాచారం ఉంటే ఇవ్వాలని కేటీఆర్‌కు సూచించారు. 

పౌరసరఫరాల శాఖలో రూ.వెయ్యికోట్ల స్కామ్‌ జరిగిందంటూ చేస్తున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని, సత్యదూరమైన వ్యాఖ్యలతో ప్రజల్లో లేనిపోని అనుమానాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.58వేల కోట్ల అప్పుల భారం మోపిందని, రైస్‌మిల్లర్ల వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రూ.11వేల కోట్ల బియ్యం పెట్టిందని, వాస్తవానికి ఆ స్టాకు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పారు. అత్యంత పారదర్శకంగా పాలన సాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని, తాము మిల్లర్ల దగ్గర బేరాలు, వసూళ్లకు పాల్పడే రకం కాదని స్పష్టం చేశారు. 

కొంతమంది మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించామని, కొన్నింటిని డిఫాల్టర్‌ జాబితాలో చేర్చామని, మరికొన్ని యాజమాన్యాలను అరెస్టు చేశామన్నారు. అరెస్టులు చేసి వేధించే విధానం తమ ప్రభుత్వానికి లేదని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కేంద్రీయ బండార్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టింది..ఆ తర్వాత తొలగించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేదన్నారు. సరైన అవగాహనతో కేటీఆర్‌ మాట్లాడాలని హితువు పలికారు. 

బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిఅధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు ఓవర్‌స్పీడుతో అర్థం లేకుండా మాట్లాడడం సరికాదని సూచించారు. బాధ్యతతో మాట్లాడాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. ఢిల్లీలో డబ్బులు ఇచ్చి ఫ్లోర్‌లీడర్‌ పదవి తెచ్చుకున్నాడేమో...అందుకే దూకుడుతో ఉన్నాడని వ్యాఖ్యానించారు. డీఫాల్టర్‌ అయిన రైస్‌ మిల్లుల తరఫున బీఆర్‌ఎస్, బీజేపీ పొటాపొటీగా మాట్లాడుతున్నాయని, దీనిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.  

మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 
రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్టబెట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సీట్లు రావనే అక్కసుతో ఇష్టానుసారంగా బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వ పనితీరే సమాధానమన్నారు.సూర్యాపేట సభకు అసలు కరెంటు కనెక్షన్‌ తీసుకోలేదని, జనరేటర్ల ఆధారంగానే ఆపార్టీ నేతలు ఏర్పాటు చేశారన్నారు. కరెంటు తీసుకోన్నప్పుడు కోతలు ఎలా జరుగుతాయని, అక్కడ సరైన ఏర్పాట్లు చేయకుండా డిస్కంలను బద్నాం చేయొద్దన్నారు. గతేడాది వరంగల్‌ ఎంజీఎంలో 121 సార్లు పవర్‌ బ్రేక్‌డౌన్‌ అయ్యిందని, రోగులను ఎలుకలు పీక్కుతిన్నాయని, వాటిపై మాట్లాడని కేటీఆర్‌ ఇప్పుడు డయాలసిస్‌ యూనిట్‌లో విద్యుత్‌ సమస్యపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు.  

– ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరగానే ఆ పార్టీ చేసిన తప్పులు, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాలన్నీ ఒప్పులు అయ్యాయా అని ప్రశ్నించారు. పౌరసరఫరాల సంస్థ అప్పులపాలు కావడానికి గత బీఆర్‌ఎస్, కేంద్ర ప్రభుత్వాలే కారణమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు నెలల్లోనే రుణమాఫీ చేయనుందని, ఎన్నికల కోడ్‌ ఉండడంతో జాప్యం జరిగిందని, ఆగస్టు 15లోగా మాఫీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.    

Advertisement
 
Advertisement
 
Advertisement