విద్యార్థుల ఆందోళన పట్టించుకోరా

TPCC Chief Revanth Reddy Letter To CM KCR Over Basara IIIT - Sakshi

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళనపై కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో వారంరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థుల సమస్యలు సిల్లీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హేళనగా మాట్లాడటం విచారకరమని అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

‘బాసర ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మాలాంటి వారు వెళ్లాలనుకుంటే హైదరాబాద్‌ నుంచి బాసర వరకు పోలీసులను మోహరించి అరెస్టులకు పాల్పడుతున్నారు’అని పేర్కొన్నారు. మరోవైపు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్‌ తనయుడు, మంత్రి కేటీఆర్‌ జూన్‌ 15న చేసిన ట్వీట్‌కు ఇప్పటివరకు అతీగతీ లేదని ఎద్దేవా చేశారు.

లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని పారిశ్రామికవేత్తలతో ఫొటో లు దిగే కేటీఆర్‌కు విద్యార్థుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరు వల్ల ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ న్యాక్‌ దృష్టిలో సి గ్రేడ్‌కు పడిపోయిందని పేర్కొన్నారు. న్యాక్‌ గ్రేడ్‌ ఆధారంగానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో మల్టీనేషనల్‌ కంపెనీలు పాల్గొంటాయని, యూజీసీ నుంచి పరిశోధనలకు నిధులు వస్తాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇవన్నీ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు.

హాస్టళ్లలో ఉంటూ ఆందోళన చేస్తున్న దాదాపు 8 వేల మంది విద్యార్థులకు భోజనం పెట్టబోమని హెచ్‌వోడీలు బెదిరింపులకు పాల్పడటం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీకి రెగ్యులర్‌ వీసీని నియమించి, వీసీ క్యాంపస్‌లోనే ఉండాలని డిమాండ్‌ చేశారు.  

ప్రైవేటీకరణలో భాగమే: రేవంత్‌రెడ్డి  
సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో సైన్యంలోనూ ప్రైవేటీకరణను ప్రోత్సహించే ఉద్దేశంతోనే కేంద్రం అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసేవరకు కాంగ్రెస్‌ పోరాడుతుందని, రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. ఇక కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే కాంగ్రెస్‌ అధినేతలు సోనియా, రాహుల్‌ గాంధీలపై ఈడీ కేసులు బనాయించిందని విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top