
హైదరాబాద్: కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో కులగణనపై నిర్ణయం తీసుకున్న అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు.
‘దేశ చరిత్రలో మొదటిసారిగా కులగణన నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ. కుల గణన తో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించడం జరిగింది’ అని ఆయన అన్నారు.
కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ‘భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి కులగణన చేశారు. రాహుల్ గాంధీ పోరాటం.. రేవంత్ రెడ్డి ఆలోచన విధానం వల్లనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం.. రాహుల్ గాంధీ సాధించిన విజయం. దేశ వ్యాప్తం గా ఉన్న బడుగు బలహీన వర్గాల విజయం ఇది. రాహుల్ గాంధీ పోరాటానికి భయపడే బీజేపీ ప్రభుత్వం కులగణన కోసం ముందుకు వచ్చింది. రాహుల్ , రేవంత్ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది. బీసీ బిడ్డ కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కులగణనకు ముందుకు వచ్చారు. 56.36 శాతం బీసీలు ఉన్నారని తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క తీశారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెడితే నేను బలపర్చాను.. అది నా అదృష్టం. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం. జంతర్ మంతర్ ధర్నా కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. మా ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ ఆ నాడు మద్దతు ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ తన రాజకీయ అవసరాల కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి దేశానికి మార్గదర్శనం చేశాడు. తెలంగాణ బీసీ కులగణనకు దిక్సూచిగా మారింది. కులగణన చేయకపోతే బడుగు బలహీన వర్గాల ఆగ్రహం తప్పదని బీజేపీకి అర్థమైంది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు వారి వాటా వారికి అందాల్సిందే. జనగణన లో కులగణన పకడ్బందీగా నిర్వహించి రిజర్వేషన్లను చట్టబద్దం చేయాలి’ అని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.