
హైదరాబాద్: చిత్తశుద్ధితో బీసీల కోసం పనిచేసేది ప్రధాని నరేంద్ర మోదీనేనని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. బీసీ కమిషన్ తీసుకొచ్చింది మోదీనేనని ఆయన తెలిపారు. ఈరోజు(సోమవారం, జూలై 28) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు..
కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశారు.. కానీ నివేదిక బయటపెట్టలేదు, తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా ఉన్నారు. కేసీఆర్ కూడా 52 శాతం మంది కంటే ఎక్కువగా ఉన్నారని అసెంబ్లీలో నోరుజారారు. కానీ ఆయన 38 శాతం ఉన్నారని చెప్పాలని చూసి దొరికిపోయారు. ఇక కాంగ్రెస్ కుల గణన కొన్ని మండలాల్లో జరగనే లేదు. ఎలా పూర్తి చేశారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే నిజాలు ఎందుకు బయటపెట్టలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనుంది.
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తాం. 42 శాతం పక్కాగా ఓన్లీ బీసీలకే ఇస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’ అని రాంచందర్ రావు విమర్శించారు.