గన్‌ పార్క్‌ దగ్గర ఉద్రిక్తత.. రాజీనామా లేఖతో హరీశ్‌ | Sakshi
Sakshi News home page

గన్‌ పార్క్‌ దగ్గర ఉద్రిక్తత.. రాజీనామా లేఖతో హరీశ్‌

Published Fri, Apr 26 2024 11:00 AM

Telangana Politics: Harish Rao Vs Cm Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్‌రావు, సీఎం రేవంత్‌ మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్ల మాటల యుద్ధం సాగుతోంది.  రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా లేఖతో గన్‌పార్క్‌కు చేరుకున్నారు. దీంతో గన్‌ పార్క్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. హరీష్‌రావు సవాల్‌తో పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్క్‌ వద్ద అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.

దమ్ముంటే సీఎం రేవంత్‌ తన సవాల్‌ స్వీకరించాలి..
గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన హరీష్ రావు.. మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఆయనకు రావడానికి మొహమాటంగా ఉంటే పీఏతోనైనా స్టాఫ్‌తోనైనా రాజీనామా లేఖను పంపించాలన్నారు. జర్నలిస్టుల సాక్షిగా.. మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నానన్నారు.

‘‘ఆగస్టు 15th లోగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసింది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పింది. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు. రైతుల కోసం నా రాజీనామా నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారు’’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు.

గన్ పార్కు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హరీశ్‌రావుకు మద్దతు పలికారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ, రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందంటూ మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. ఇప్పుడు ఆగస్టు 15 అంటూ మరోసారి ఎన్నికల స్టంట్ వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే హరీష్ రావు సవాల్‌ను స్వీకరించి ఇక్కడికి రావాలి.  ఇవాళ కాకున్నా రేపైనా హరీష్ రావు సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని తలసాని డిమాండ్‌ చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement