జీవన్‌రెడ్డికే అప్పజెపుతారా.. శ్రీధర్‌బాబును తెస్తారా?

Telangana New PCC President Issue Screen Again - Sakshi

మళ్లీ తెరపైకి తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఫైలు

ఉత్తమ్‌ మద్దతు ఎవరికో? సీనియర్లందరినీ ఢిల్లీకి పిలిపించనున్న అధిష్టానం

పీసీసీ లేదా ప్రచార కమిటీ పదవుల్లో ఒకటి రేవంత్‌కు.. రేసులో కోమటిరెడ్డి కూడా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు ముగిసిన వేళ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి పేరును ఖరారు చేసి సాగర్‌ ఉప ఎన్నిక ముగిసేంతవరకు వాయిదా వేసిన అధిష్టానం మళ్లీ ఈ ఫైలును ఏ క్షణమైనా తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అటు ఆశావహుల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే, ఈసారి కూడా జీవన్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటిస్తారా? లేదా నిర్ణయం మార్చుకుని ఇంకొకరికి అవకాశం ఇస్తారా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టీపీసీసీ చీఫ్‌ రేసులో ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలతో పాటు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఢిల్లీ పిలుపుతో షురూ...
టీపీసీసీ అధ్యక్ష వ్యవహారం మళ్లీ ఢిల్లీ పిలుపులతో ప్రారంభమవుతుందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో కూడా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ మళ్లీ తెలంగాణపై దృష్టి సారించనున్నారు. మరో వారం రోజుల్లోపు ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయని, అప్పటి నుంచే మళ్లీ టీపీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని గాంధీభవన్‌ వర్గాల ద్వారా తెలిసింది. టీపీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డిని ఎంపిక చేస్తూ సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు కనుక మళ్లీ ఆయన్నే కొనసాగించాలా లేదా మార్చాలా అన్న దానిపై సీనియర్లతో మరోమారు అభిప్రాయ సేకరణ జరపనున్నట్టు సమాచారం. ఈ మేరకు 20 మందికిపైగా సీనియర్లకు అధిష్టానం నుంచి పిలుపు వస్తుందని తెలుస్తోంది. ఈ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే టీపీసీసీ చీఫ్‌ ఎవరన్నది తేలుతుంది. ఈ వ్యవహారం పూర్తయ్యేందుకు మరో నెలన్నర రోజులన్నా పడుతుందనే చర్చ జరుగుతోంది. 

రేవంత్‌కు ఖాయం
జీవన్‌రెడ్డి పేరును మార్చాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేయాలన్నది అధిష్టానానికి కత్తిమీద సాముగానే మారనుంది. సాగర్‌ ఎన్నికల్లో జానారెడ్డి గెలిచినట్టయితే ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడం దాదాపు ఖరారైనా ఆయన ఓటమితో ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. రేసులో ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి ఇప్పటికే గట్టిగానే ఉన్నారు. ఆ పదవి తమకే కావాలంటూ పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికి టీపీసీసీ చీఫ్‌ పదవి ఇచ్చి మరొకరికి ప్రచార కమిటీ చైర్మన్‌ హోదా ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా అధిష్టానం పరిశీలించనుంది. మరోవైపు మాజీ మంత్రి, టీపీసీసీ నేతలతో పెద్దగా భేదాభిప్రాయాలు లేని శ్రీధర్‌బాబును కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడిగా తప్పుకోనున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు కూడా కొత్త అధ్యక్షుని ఎంపిక వ్యవహారంలో కీలకం కానుంది. మరి ఏం జరుగుతుందో.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే!  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top